5.5 లక్షలతో బ్యాంక్‌పై నుంచి కిందపడి..
కన్నూరు: పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం ఓ ఉద్యోగి ప్రాణం తీసింది. కేరళ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉన్ని (48) అనే ఉద్యోగి 5.5 లక్షల రూపాయలను (500, 1000 నోట్లు) బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించాడు. కన్నూరులో శుక్రవారం ఈ విషాదకర సంఘటన జరిగింది.
ఉన్ని తన వద్ద ఉన్న నగదును గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచిలో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధ్యంకాలేదు. శుక్రవారం మరోసారి ఆయన బ్యాంక్‌కు వెళ్లాడు. బ్యాంక్ ఉన్న భవనం మూడో అంతస్తులో నగదును డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఈ రోజు కూడా ప్రజలు భారీ సంఖ్యలో బ్యాంక్‌కు వచ్చారు. రద్దీ మధ్యే మూడో అంతస్తుపైకి వెళ్లిన ఉన్ని అక్కడి నుంచి కిందకు పడటంతో మరణించాడు. ఉన్ని దగ్గర ఉన్న బ్యాగ్‌లో 5.5 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా లేక పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.