కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
- హత్యకేసులో దోషిగా తేలిన మణిపూర్ సీఎం కుమారుడు
- ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విచారణ కోర్డు
ఇంఫాల్: దర్పం తలకెక్కిన మత్తులో ఓ యువకుడిని కిరాతకంగా హత్యచేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడికి కోర్టు షాకిచ్చింది. ఐదేళ్లనాటి హత్యకేసులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తనయుడు అజయ్ మీటేయికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విచారణ కోర్టు తీర్పు చెప్పింది.
ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్.. గతంలో కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2011లో బీరేన్ పదవిలో ఉన్నప్పుడే.. ఆయన కుమారుడు అజయ్ మీటెయి ఘాతుకానికి పాల్పడ్డాడు. కారుకు దారివ్వలేదన్న కారణంగా ఇరోమ్ రోజర్(21) అనే యువకుడిని కాల్చిచంపారు. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
అయితే, సాక్ష్యాధారణ సేకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో బాధితుడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి కేసు ఓ కొలిక్కి వచ్చింది. కానీ ఉరిశిక్ష పడాల్సిన అజయ్.. కేవలం 5 సంవత్సరాల జైలు విక్షతో తప్పించుకున్నాడు. కాగా, మంత్రి తనయుణ్ని కఠినంగా శిక్షించాలని, విచారణ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని బాధితుల తరఫు న్యాయవాదులు చెప్పారు.