పోటీతత్వం పెంచుకోవాలి: మన్మోహన్‌సింగ్
ప్రభుత్వరంగ సంస్థలకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలకు పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి కల్పించి, అధికారిక నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వరంగ సంస్థలు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య పోటీ తత్వం, ముందున్న సవాళ్లు అన్న అంశంపై గురువారమిక్కడ ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగించారు.
ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థలు తయారుకావాలని, పోటీ వాతావరణం లేకపోవడం వల్ల సామాన్యుడికే నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక సంస్థను ప్రభుత్వం నిర్వహించడం అంటే దానర్థం దాన్ని పోటీతత్వానికి దూరంగా ఉంచడం కాదు. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వరంగ సంస్థలు పోటీ పడాలి. భవిష్యత్తుల్లో రాబోయే ప్రభుత్వాలు ఇందుకు దోహదపడే విధానాలకే పెద్దపీట వేస్తాయి’ అని ఆయన అన్నారు.