‘అణు’ ఆటంకాలను అధిగమిద్దాం
మాస్కో: రక్ష ణ, ఇంధనం, పెట్టుబడుల రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సహకారాన్ని బలోపేతం చేయాలని భారత్, రష్యా సంకల్పించాయి. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ)లో రెండో, మూడో నంబర్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యాయపరంగా ఎదురైన చిక్కులను పరిష్కరించుకోవాలని నిర్ణయించా యి. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారమిక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల 14వ వార్షిక భేటీలో భాగంగా ప్రతినిధుల స్థాయిలో గంటన్నరకు పైగా సాగిన చర్చల్లో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిం చారు. పాక్, ఉగ్రవాద అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. పుతిన్‌తో మన్మోహన్‌కు ఇది ఐదో భేటీ. భేటీ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
పౌర అణు సహకారంపై 2010లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్‌మ్యాప్ అమలుకు కట్టుబడి ఉన్నామని మన్మోహన్ చెప్పారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. రష్యా సాయంతో తమిళనాడులోని కూడంకుళంలో నిర్మించిన అణు ప్లాంటులో రెండు కొత్త రియాక్టర్ల ఏర్పాటు, సాంకేతిక సహకారం కోసం ఒప్పందాన్ని శీఘ్రంగా ఖరారు చేయాలని సంకల్పించినట్లు ఉభయ దేశాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కేఎన్‌పీపీని భారత అణు ప్రమాద బాధ్యత చట్టం పరిధిలోకి కాకుండా అంతర్ ప్రభుత్వాల ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలని రష్యా పట్టుపడుతుండడంతో కొత్త రియాక్టర్ల ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడం తెలిసిందే. కాగా, తమ దేశంలో తయారైన కూడంకుళం ఒకటో యూనిట్ ప్రారంభంపై పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. దాన్నుంచి విద్యుత్ కొన్ని గంటల్లో గ్రిడ్‌కు అనుసంధానం కానుందన్నారు. ఇంధనం, రక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్, మన్మోహన్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల మధ్య కూడా గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 25 శాతం పెరిగి 1,100 కోట్ల డాలర్లు చేరుకుందన్నారు. పుతిన్, మన్మోహన్‌ల భేటీ సందర్భంగా ఇరు దేశాలు ఐదు ఒప్పందాలు చేసుకున్నాయి. ఖై దీలు మిగిలిన శిక్షను స్వదేశంలో పూర్తి చేసుకోవ డానికి వారిని స్వదేశానికి బదిలీ చేయడం, ఇంధనం, బయోటెక్నాలజీ, శాస్త్రసాంకేతికం తదితర రంగాల్లో సహకారంపై వీటిని కుదుర్చుకున్నాయి.
ఐఎంఎఫ్‌ను సంస్కరించాలి..
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో తక్షణమే సంస్కరణలను చేపట్టాలని, వర్ధమాన దేశాలకు తమ వాణి వినిపించేందుకు వాటికి మరింత ప్రాతి నిధ్యం కల్పించి ఓటు హక్కు విలువ పెంచాలని ఇరు దేశాలు కోరాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విస్తరించాలన్నాయి. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా పేర్కొంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న నిఘా సంబంధ ఆపరేషన్లపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కాగా, భేటీ సందర్భంగా పుతిన్, మన్మోహన్‌లు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ‘భారత్, రష్యాల ఉమ్మడి విజయాల్లో చాలా వాటిని మీ నాయకత్వంలోనే సాధించాం’ అని పుతిన్.. మన్మోహన్‌తో అన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన ఘనత మీదేనని మన్మోహన్.. పుతిన్‌తో చెప్పారు. అంతకుముందు మన్మోహన్ మాస్కోలోని మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలే షన్స్‌లో ఉపన్యసించారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఉభయ దేశాల సంబంధాలు కాలానికి అనుగుణంగా మారాలన్నారు. రక్షణ అవసరాల విషయంలో రష్యా ఇకముందూ తమకు కీలక భాగస్వామిగానే ఉంటుందని స్పష్టం చేశారు. మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన్మోహన్‌కు అరుదైన గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చిన ఈ పట్టాను తనకు గొప్ప గౌరవమని మన్మోహన్ పేర్కొన్నారు.