సరిహద్దుల్లో శాంతి కీలకం
బీజింగ్: ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం బీజింగ్ చేరుకున్నారు. చైనా విదేశాంగ ఉపమంత్రి జాయ్ అన్ ఆయనకు స్వాగతం పలికారు. మన్మోహన్‌బుధవారం చైనా అధ్యక్ష, ప్రధానులు జీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లతో చర్చలు జరుపుతారు. చైనా పార్లమెంటు చైర్మన్ జాంగ్ దెజియాంగ్‌తోనూ భేటీ అవుతారు. జిన్‌పింగ్, కెకియాంగ్‌లతో చర్చల తర్వాత సరిహద్దు భద్రత సహకార ఒప్పందం(డీబీసీఏ) కుదురుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల భారత భూభాగంలో చోటుచేసుకున్న చైనా బలగాల చొరబాట్లు ఇకపై పునరావృతం కాకుండా ఈ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. స్టేపుల్డ్ వీసాలు సహా అన్ని అంశాలూ చర్చకు రానున్నాయని తెలిపారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి అని మన్మోహన్ పేర్కొన్నారు. బీజింగ్ పర్యటన సందర్భంగా మంగళవారం మీడియాకు ఇచ్చిన రాతపూర్వక ఇంటర్వ్యూలో ఈమేరకు పేర్కొన్నారు. ‘ఇరు దేశాల సరిహద్దు సమస్య సున్నితమైంది, క్లిష్టమైంది. పరిష్కారానికి చాలా సమయం పడతుంది. దీనికి రాజకీయ పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధులను నియమించాం.
వారు పరిష్కారం కోసం మార్గదర్శకాలను రూపొందించి, ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నారు. సమస్య పరిష్కారానికి చాలా సయయం పడుతుంది. అప్పటివరకు ఇరు దేశాలు సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయి’ అని తెలిపారు. 1993, 1996, 2005 నాటి ఒప్పందాలకు కట్టుబడి, చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని కోరుకుంటున్నానని తర్వాత బీజింగ్‌లో విలేకర్లతో అన్నారు. ఆయన పర్యటన సందర్భంగా భారత్-చైనా ఈసీఓల ఫోరం రెండో సమావేశాన్ని నిర్వహించనున్నారు. మన్మోహన్, కెకియాంగ్‌లు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. అనిల్ అంబానీ నేతృత్వంలోని పదిమంది భారత పారిశ్రామికవేత్తలతోపాటు చైనా పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొంటారు. మన్మోహన్ గురువారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ స్కూల్లో యువనేతలను ఉద్దేశించి ప్రసంగించి, అదేరోజు స్వదేశానికి బయల్దేరుతారు.
ప్రధాని విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు కురిపించింది. ప్రధాని తరచుగా సాగించే విదేశీ పర్యటనల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. పార్లమెంటులో కీలక సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనూ ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒకవైపు పొదుపు చర్యల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ప్రధాని చాలా తరచుగా విదేశీ పర్యటనలకు వెళుతుండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.