Li Keqiang
-
గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత
బీజింగ్: చైనా మాజీ ప్రధాని (Premier) లీ కెకియాంగ్ (68) కన్నుమూశారు. షాంఘైలో గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. సంస్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్ను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొక్కేశారనే రాజకీయ విమర్శ ఒకటి ఉంది. అన్హూయి ప్రావిన్స్‌కు చెందిన ఓ రాజకీయ నేత కొడుకు లీ కెకియాంగ్. రాజకీయాల్లో నేతలకు స్వేచ్ఛా నిర్ణయాలు ఉండాలనే కెకియాంగ్.. దశాబ్దకాలంగా మాత్రం జిన్‌పింగ్ సారథ్యంలోని పార్టీ గీత మీదే నడిచారు. మాజీ బ్యూరోక్రాట్ అయిన ఈయన ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ఆర్థిక సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చే విధానాలను ఆయన రూపొందించారు. అయితే హెనాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తూండగా అడ్డగోలుగా రక్తదాన శిబిరాల నిర్వహణ, ఫలితంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు రికార్డు కావడంతో ఆయన ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. తరువాతి కాలంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా లీ కెకియాంగ్ను ఓ కీలుబొమ్మ ప్రధానిగా మార్చేశారని చైనా మేధావులు తరచూ విమర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన కెకియాంగ్ సేవల్ని కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు జిన్‌పింగ్ వినియోగించుకోలేదని అభిప్రాయపడుతుంటారు. State Media is reporting that Li Keqiang has died of a heart attack. No word on a funeral, but mourning dead leaders, especially ones recently forced out of office, is always a tricky proposition for the Party. pic.twitter.com/NHHX8waDmi — Jeremiah Jenne (@JeremiahJenne) October 27, 2023 -
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
పాకిస్తాన్‌కు చైనా మద్దతు
బీజింగ్: భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సమస్యలను కేవలం శాంతి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే 48 దేశాలు సభ్యులుగా ఉన్న అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో పాకిస్తాన్ సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌తో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బీజింగ్‌లో సమావేశమై చర్చలు జరిపిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఆదివారం సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ‘పరస్పర గౌరవంతో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న పాకిస్తాన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. భారత్–పాక్ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు పాక్ చేస్తున్న కృషికి మద్దతు తెలుపుతున్నాం. పాక్ ఉగ్రవాదుల ఏరివేతలో అద్భుతంగా పనిచేస్తోంది. తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం– ఈ మూడింటిపై పరస్పర సహకారంతో పోరాడేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటీఐఎం), అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు తమ భూభాగాన్ని వాడుకోకుండా, చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడేలా పాక్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం’ అని సంయుక్త ప్రకటనలో చైనా తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ స్పందిస్తూ దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)లో చైనా మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్ శనివారం ప్రకటించారు. ఎన్ఎస్జీలో చేరాలన్న భారత్ ప్రయత్నాలను చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అమెరికా మద్దతు ఇస్తున్నప్పటికీ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇండియా సంతకం చేయకపోవడాన్ని సాకుగా చూపుతూ చైనా భారత్ చేరికను అడ్డుకుంటోంది. -
చైనా రక్షణమంత్రిగా మిస్సైల్ ఎక్స్పర్ట్!
బీజింగ్: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్ వెన్కింగ్కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా.. సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్‌కు ఈ అవకాశం దక్కింది. విదేశాంగ మంత్రికి స్టేట్ కౌన్సిలర్ పదవి చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్ యిను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్ కౌన్సిలర్ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్ కావడం గమనార్హం. -
మరో ఐదేళ్లు జిన్‌పింగ్
బీజింగ్: చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది. వారసునిపై ఎటువంటి స్పష్టమైన సూచనలు చేయకుండా జిన్‌పింగ్‌కు రెండోసారి పార్టీ పగ్గాలను అప్పగించింది. బీజింగ్‌లోని గ్రాండ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్.. జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెంట కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని లీ కెకియాంగ్, వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే కొత్త పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సభ్యులను జిన్‌పింగ్ మీడియాకు పరిచయం చేశారు. జిన్‌పింగ్, కెకియాంగ్ కాక రూలింగ్ కౌన్సిల్లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్(63) చోటు దక్కించుకున్నారు. 2022లో జరిగే తదుపరి కాంగ్రెస్‌లో వీరిలో ఎవరూ జిన్‌పింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదని వీరి వయసును బట్టి తెలుస్తోంది. వారం పాటు కొనసాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్‌తో ముగిసింది. చివరిరోజైన మంగళవారం జిన్‌పింగ్ పేరు, సిద్ధాంతాలకు పార్టీ రాజ్యాంగంలో చోటు కల్పిస్తూ సీపీసీ కాంగ్రెస్ సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆధునిక చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, మాజీ అధ్యక్షుడు డెంగ్ జియాయోపింగ్తో సమాన స్థాయిని జిన్‌పింగ్‌కు కల్పించింది. 2021లో సీపీసీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోనుంది. కొత్త కమిటీని మీడియాకు పరిచయం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ చైనాతో పాటు ప్రపంచంపై తన విజన్ గురించి వివరించారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకు వెళుతోందో వివరించారు. నమ్మకం, ఆత్మగౌరవంతో చైనా ప్రజలు ముందడుగు వేస్తున్నారని, మానవాళి శాంతి, అభివృద్ధి కోసం ఇతర దేశాలతో కలసి ముందుకు వెళతామని చెప్పారు. దేశాన్ని పురోగతివైపు నడిపించడానికి సీపీసీ సానుకూల శక్తిని అందించిందని చెప్పారు. కాగా, జిన్‌పింగ్ మూడో పర్యాయం కూడా దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!
-
పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!
ఊహించినట్టుగానే ’డ్రాగన్’ చైనా దాయాది పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, వ్యూహాత్మకంగా కశ్మీర్ అంశం, ఉడీ ఉగ్రవాద దాడి అంశాలపై మౌనం వహించినట్టు చైనా మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. అన్ని కాలాల్లోనూ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా-పాక్ పరస్పరం గట్టి మద్దతు ఇచ్చుకుంటున్నాయని, వాటి స్నేహం చెక్కుచెదరనిదని షరీఫ్‌తో భేటీ అనంతరం లీ పేర్కొన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా జిన్హుహా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పాకిస్థాన్‌కు అన్నివిధాలా ఆచరణాత్మక సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నదని లీ అన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)పై పరస్పర సహకారం ద్వారా మంచి పురోగతి సాధించినట్టు లీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా పాక్‌తో అత్యున్నత సంబంధాలు కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు లీ అన్నారని జిన్హుహా పేర్కొంది. అయితే పాకిస్థాన్ మీడియా మాత్రం ఈ భేటీపై తనకు అనుకూలంగా కథనాలు రాసుకుంది. కశ్మీర్‌పై పాక్ వైఖరికి చైనా మద్దతును కొనసాగిస్తామని లీ షరీఫ్‌కు చెప్పినట్టు డాన్ దినపత్రిక చెప్పుకొచ్చింది. ’మేం పాకిస్థాన్‌కు మద్దతునిస్తాం. ప్రతి వేదికపై ఆ దేశం కోసం మాట్లాడుతాం’ అని లీ షరీఫ్‌కు హామీ ఇచ్చినట్టు ’డాన్’ రాసుకొచ్చింది. కశ్మీర్ పై పాక్ వైఖరికి చైనా గొప్ప ప్రాధాన్యాన్ని ఇస్తున్నదని, పాకిస్థాన్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని చైనా పేర్కొన్నదని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. -
చైనాలో మోదీ.. రెండోరోజు టూర్
-
ఆ 24 ఒప్పందాలు ఇవే..
బీజింగ్: చైనా పర్యటనలో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇరుదేశాల అధినేతలు పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలపై సంతకాలు ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అనంతరం మోదీ ప్రాంతీయ నేతల వేదికపై మాట్లాడారు. చైనాలో పర్యటన సంతోషంగా ఉందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపామని, సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలను, రాష్ట్రాలతో పాటు ప్రజల మధ్యకు తీసుకు వెళతామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమైనదని, వాణిజ్య, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం అని అన్నారు. చైనాతో ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్- చైనాతో చేసుకున్న ఒప్పందాల వివరాలు: 1. చెన్నై, చైనాలోని చెంగ్డూలో రాయభార కార్యాలయాలు ఏర్పాటు 2. భారత్‌లో వృత్తి విద్యను మెరుగు పరచడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోసం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు పరస్పర సహకారం అందించుకోవడం 3. వ్యాపార సంబంధాలను దౌత్యవిధానం ద్వారా నిర్వహించడం 4. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య సహాయ సహాకారాలు కొనసాగించాలి 5. భారత్, చైనా రైల్వే సంస్థల మధ్య నిర్వహణ విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం 6. రెండు దేశాల మధ్య విద్యకు సంబంధించిన విధానాలను పరస్పరం అవలంభించడం 7. ఖనిజాలు, గనుల రంగాలలో పరస్పరం సహకరించుకోవడం 8. అంతరిక్ష సంబంధ విషయాలలో మైత్రి కొనసాగించడం 9. భారత్ దిగుమతి చేసుకుంటున్న రేప్ సీడ్ ఉత్పత్తులపై సురక్షిత మార్గదర్శకాలు 10. దూరదర్శన్, సీసీటీవీల మధ్య ప్రసార సంబంధమైన అంశంపై ఒప్పందం 11. ఇరు దేశాలు కలిసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం 12. రాజకీయ, మిలటరీ, ఆర్థిక సంబంధమైన అంశాలను అభివృద్ధి చేసుకునేందుకు రెండు దేశాలు కలిసి సంస్థలను నెలకొల్పడం 13. నీతి ఆయోగ్, డెవలప్ మెంట్ రీసెర్చ్ సెంటర్ మధ్య పరస్పర అవగాహన 14. భూకంప విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ రంగాలలో పరస్పర సహకారం 15. వాతావరణ మార్పులు, సముద్ర విజ్ఞాన శాస్త్రం అంశాలపై అంగీకారం 16. భూ విజ్ఞాన శాస్త్రం రంగానికి సంబంధించి ఒప్పందం 17. రాష్ట్రాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల నేతల నిమామకాలపై పరస్పర అవగాహన 18. భారత్, చైనా దేశాలలో ఉన్న రాష్ట్రాలు, మునిసిపాలిటీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుకోవడం 19. చైనాలోని సిచువాన్, భారత్ లోని కర్ణాటక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు 20. తమిళనాడులోని చెన్నై, చైనాలోని చోంగ్జింజ్ నగరాల మధ్య లావాదీవిలకు సంబంధించి అవగాహనా ఒప్పందం 21. హైదరాబాద్, చైనాలోని గింగ్డౌ నగరాల మధ్య స్నేహపూర్వక వర్తక, వ్యాపార అంశంపై పరస్పర ఒప్పందం 22. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, చైనాలోని డున్హువాంగ్ నగరాల మధ్య వ్యాపార ఒప్పందం 23. ఐసీసీఆర్, ఫుడాన్ విశ్వవిద్యాలయాలం మధ్య సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ ఏర్పాటుకు ఒప్పందం 24. భారతీయ యోగా విద్యను చైనాలోని కుమ్నింగ్ కాలేజీలో ప్రవేశపెట్టేందుకు ఇరుదేశాల మధ్య సమ్మతి -
చైనాతో 24 ఒప్పందాలపై అంగీకారం
చైనా : చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోఈ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. తొలిరోజు పర్యటనలో భాగంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇరుదేశాల మధ్య వ్యాపార,వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. -
చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. గురువారం చైనా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి ప్రధాని లి కెక్వియాంగ్ లో విస్తృతచర్చలు జరపనున్నారు. భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య శాంతి సంబంధాల కల్పన ఈ పర్యటనలో భాగమని ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రసిద్ధ బౌద్ధ నిర్మాణం పగోడాను నేడు నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. -
ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్
బీజింగ్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ... ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 239 మంది ప్రయాణికులు మరణించారని మలేసియా ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనపై చైనా ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. విమాన ఆచూకీ కనుగొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మలేసియా ప్రభుత్వానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ విజ్ఞప్తి చేశారు. విమాన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగాళాఖాతంలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్లు మేర ప్రపంచ దేశాల సహాయంతో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయిందని లీ కెకియాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఇంకా గాలింపు చర్యలు జరుపుతూనే ఉందని గుర్తు చేశారు. మలేసియా కూడా గాలింపు చర్యల చేపడితే విమాన జాడ కనుక్కోవచ్చని చైనా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఫ్రెంచ్ ప్రధాని ఎం వాల్స్ కూడా పాల్గొన్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
చైనాతో సరిహద్దు భద్రత
బీజింగ్: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించడంపై భారత్-చైనా మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ మధ్య విస్తృత చర్చల అనంతరం సరిహద్దు భద్రత సహకార ఒప్పందం(బీడీసీఏ)పై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఇరు పక్షాలు ముఖాముఖి తలపడకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఎవరి ప్రాంతంలో వారే గస్తీ ఉండాలి తప్ప ఒకరి ప్రాంతంలోకి మరొకరు చొరబడకూడదని అంగీకారానికి వచ్చాయి. లడఖ్‌లోని డెప్సాంగ్ వ్యాలీలో చైనా దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. కాగా, పది నిబంధనలతో కూడిన బీడీసీఏ ఒప్పందంపై భారత్ తరఫున రక్షణ కార్యదర్శి ఆర్కే మాధుర్, చైనా నుంచి పీఎల్ఏ డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ సన్ జియాంగ్వో సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఇరు పక్షాల మిలటరీ ప్రధాన కార్యాలయాల మధ్య హాట్‌లైన్, 4 వేల కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట సమావేశ స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజుల పర్యటనకు ఇక్కడకు వచ్చిన మన్మోహన్ సింగ్ బుధవారం చైనా ప్రధాని లీతో మూడు గంటలకుపైగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అయితే వీసాల ఒప్పందంపై చైనా సానుకూలంగా ఉన్నా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఆర్చర్లలకు చైనా ఎంబసీ స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై చైనాకు భారత్ తన అభ్యంతరాలు తెలిపింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన మన్మోహన్.. చైనీయులకు వీసాలు మంజూరు చేయడంలో భారత్ ఉదారంగా వ్యవహరిస్తుందని, చైనా కూడా అలాగే వ్యవహరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలో ఇరు దేశాల ప్రధానులు సమావేశం కావడం 1954 తర్వాత ఇదే ప్రథమమని చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాలు నిలకడైన అభివృద్ధివైపు అడుగులు వేయాలన్నా, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలన్నా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని ఆ ప్రకటనలో అభిలషించారు. సాంస్కృతిక రంగంలోనూ, నలందా యూనివర్సిటీ, రోడ్లు, హైవేల అభివృద్ధి, భారత్‌లో చైనా విద్యుత్ పరికరాల సర్వీస్ సెంటర్ల ఏర్పాటు, ఢిల్లీ-బీజింగ్, బెంగళూరు-చెంగ్డు, కోల్‌కతా-కన్మింగ్ పట్టణాల మధ్య సిస్టర్ సిటీ రిలేషన్షిప్ అభివృద్ధి తదితర ఒప్పందాలు జరిగాయి. బంగ్లాదేశ్, మయన్మార్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనిపై సంయుక్త అవగాహనకు తొలి బీసీఐఎం(బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్) ఆర్థిక కారిడార్ రూపొందించడానికి ప్రత్యేక సమావేశాన్ని డిసెంబర్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. బ్రహ్మపుత్రపై చైనా భరోసా: సీమాంతర నదులపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న నిపుణుల స్థాయి విధానం(ఈఎల్ఎం) ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. బహ్మపుత్ర నదిపై కొత్త ఆనకట్టలు కట్టడానికి చైనా సిద్ధమవుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నామనే విషయాన్ని చైనా మన్మోహన్‌కు ఘనంగా ఆహ్వానం పలికి ప్రకటించింది. -
భారత్ - చైనా సరిహద్దు రక్షణ ఒప్పందం
చైనాతో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం ( బీడీసీఏ)పై సంతకం చేసినట్లు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ప్రధాని లి కెషాంగ్‌తో మన్మోహన్ సింగ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఇరుదేశాల ప్రధానులు మీడియా ఎదుట మాట్లాడారు. చైనాతో ప్రధానితో భేటీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని మన్మోహన్ వివరించారు. అలాగే తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చైనాతో కలసి పని చేస్తామన్నారు. మన్మోహన్ పాలనలో భారత్, చైనా సంబంధాలు త్వరితగతిన మరింత మెరుగుపడటమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతాయని చైనా ప్రధాని లి కెషాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌తో జరిగిన భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాకిక్ష సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించినట్లు చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం చైనా చేరుకున్నారు. -
చైనా ప్రధానితో మన్మోహన్ భేటీ
భారత్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చైనా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఆ దేశ ప్రధాని లి కెకియాంగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య వివిధ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ విషయాలు ఆ భేటీలో చర్చకు రానున్నాయి. అంతకు ముందు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో సింగ్ గార్డ్ ఆఫ్ హానర్ గౌరవాన్ని అందుకున్నారు. ఈ భేటీలో భాగంగా బోర్డర్ డిఫెన్స్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ ( బీడీసీఏ) పై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం రాత్రి చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. మన్మోహన్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... పోరుగు దేశమైన చైనాతో భారత్‌కు గల శతాబ్దాల బంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు. -
సరిహద్దుల్లో శాంతి కీలకం
బీజింగ్: ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం బీజింగ్ చేరుకున్నారు. చైనా విదేశాంగ ఉపమంత్రి జాయ్ అన్ ఆయనకు స్వాగతం పలికారు. మన్మోహన్బుధవారం చైనా అధ్యక్ష, ప్రధానులు జీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లతో చర్చలు జరుపుతారు. చైనా పార్లమెంటు చైర్మన్ జాంగ్ దెజియాంగ్తోనూ భేటీ అవుతారు. జిన్‌పింగ్, కెకియాంగ్‌లతో చర్చల తర్వాత సరిహద్దు భద్రత సహకార ఒప్పందం(డీబీసీఏ) కుదురుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల భారత భూభాగంలో చోటుచేసుకున్న చైనా బలగాల చొరబాట్లు ఇకపై పునరావృతం కాకుండా ఈ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. స్టేపుల్డ్ వీసాలు సహా అన్ని అంశాలూ చర్చకు రానున్నాయని తెలిపారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి అని మన్మోహన్ పేర్కొన్నారు. బీజింగ్ పర్యటన సందర్భంగా మంగళవారం మీడియాకు ఇచ్చిన రాతపూర్వక ఇంటర్వ్యూలో ఈమేరకు పేర్కొన్నారు. ‘ఇరు దేశాల సరిహద్దు సమస్య సున్నితమైంది, క్లిష్టమైంది. పరిష్కారానికి చాలా సమయం పడతుంది. దీనికి రాజకీయ పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధులను నియమించాం. వారు పరిష్కారం కోసం మార్గదర్శకాలను రూపొందించి, ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నారు. సమస్య పరిష్కారానికి చాలా సయయం పడుతుంది. అప్పటివరకు ఇరు దేశాలు సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయి’ అని తెలిపారు. 1993, 1996, 2005 నాటి ఒప్పందాలకు కట్టుబడి, చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని కోరుకుంటున్నానని తర్వాత బీజింగ్‌లో విలేకర్లతో అన్నారు. ఆయన పర్యటన సందర్భంగా భారత్-చైనా ఈసీఓల ఫోరం రెండో సమావేశాన్ని నిర్వహించనున్నారు. మన్మోహన్, కెకియాంగ్లు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. అనిల్ అంబానీ నేతృత్వంలోని పదిమంది భారత పారిశ్రామికవేత్తలతోపాటు చైనా పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొంటారు. మన్మోహన్ గురువారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ స్కూల్లో యువనేతలను ఉద్దేశించి ప్రసంగించి, అదేరోజు స్వదేశానికి బయల్దేరుతారు. ప్రధాని విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు కురిపించింది. ప్రధాని తరచుగా సాగించే విదేశీ పర్యటనల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. పార్లమెంటులో కీలక సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనూ ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒకవైపు పొదుపు చర్యల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ప్రధాని చాలా తరచుగా విదేశీ పర్యటనలకు వెళుతుండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.