చైనాతో సరిహద్దు భద్రత
బీజింగ్: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించడంపై భారత్-చైనా మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ మధ్య విస్తృత చర్చల అనంతరం సరిహద్దు భద్రత సహకార ఒప్పందం(బీడీసీఏ)పై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఇరు పక్షాలు ముఖాముఖి తలపడకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఎవరి ప్రాంతంలో వారే గస్తీ ఉండాలి తప్ప ఒకరి ప్రాంతంలోకి మరొకరు చొరబడకూడదని అంగీకారానికి వచ్చాయి.
లడఖ్‌లోని డెప్సాంగ్ వ్యాలీలో చైనా దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. కాగా, పది నిబంధనలతో కూడిన బీడీసీఏ ఒప్పందంపై భారత్ తరఫున రక్షణ కార్యదర్శి ఆర్‌కే మాధుర్, చైనా నుంచి పీఎల్‌ఏ డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ సన్ జియాంగ్వో సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఇరు పక్షాల మిలటరీ ప్రధాన కార్యాలయాల మధ్య హాట్‌లైన్, 4 వేల కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట సమావేశ స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజుల పర్యటనకు ఇక్కడకు వచ్చిన మన్మోహన్ సింగ్ బుధవారం చైనా ప్రధాని లీతో మూడు గంటలకుపైగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అయితే వీసాల ఒప్పందంపై చైనా సానుకూలంగా ఉన్నా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఆర్చర్లలకు చైనా ఎంబసీ స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
దీనిపై చైనాకు భారత్ తన అభ్యంతరాలు తెలిపింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన మన్మోహన్.. చైనీయులకు వీసాలు మంజూరు చేయడంలో భారత్ ఉదారంగా వ్యవహరిస్తుందని, చైనా కూడా అలాగే వ్యవహరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలో ఇరు దేశాల ప్రధానులు సమావేశం కావడం 1954 తర్వాత ఇదే ప్రథమమని చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాలు నిలకడైన అభివృద్ధివైపు అడుగులు వేయాలన్నా, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలన్నా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని ఆ ప్రకటనలో అభిలషించారు. సాంస్కృతిక రంగంలోనూ, నలందా యూనివర్సిటీ, రోడ్లు, హైవేల అభివృద్ధి, భారత్‌లో చైనా విద్యుత్ పరికరాల సర్వీస్ సెంటర్ల ఏర్పాటు, ఢిల్లీ-బీజింగ్, బెంగళూరు-చెంగ్డు, కోల్‌కతా-కన్‌మింగ్ పట్టణాల మధ్య సిస్టర్ సిటీ రిలేషన్‌షిప్ అభివృద్ధి తదితర ఒప్పందాలు జరిగాయి. బంగ్లాదేశ్, మయన్మార్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనిపై సంయుక్త అవగాహనకు తొలి బీసీఐఎం(బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్) ఆర్థిక కారిడార్ రూపొందించడానికి ప్రత్యేక సమావేశాన్ని డిసెంబర్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
బ్రహ్మపుత్రపై చైనా భరోసా: సీమాంతర నదులపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న నిపుణుల స్థాయి విధానం(ఈఎల్‌ఎం) ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. బహ్మపుత్ర నదిపై కొత్త ఆనకట్టలు కట్టడానికి చైనా సిద్ధమవుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నామనే విషయాన్ని చైనా మన్మోహన్‌కు ఘనంగా ఆహ్వానం పలికి ప్రకటించింది.