ఆ 24 ఒప్పందాలు ఇవే..
బీజింగ్: చైనా పర్యటనలో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇరుదేశాల అధినేతలు పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలపై సంతకాలు ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
అనంతరం మోదీ ప్రాంతీయ నేతల వేదికపై మాట్లాడారు. చైనాలో పర్యటన సంతోషంగా ఉందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపామని, సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలను, రాష్ట్రాలతో పాటు ప్రజల మధ్యకు తీసుకు వెళతామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమైనదని, వాణిజ్య, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం అని అన్నారు. చైనాతో ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
భారత్- చైనాతో చేసుకున్న ఒప్పందాల వివరాలు:
1. చెన్నై, చైనాలోని చెంగ్డూలో రాయభార కార్యాలయాలు ఏర్పాటు
2. భారత్లో వృత్తి విద్యను మెరుగు పరచడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోసం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు పరస్పర సహకారం అందించుకోవడం
3. వ్యాపార సంబంధాలను దౌత్యవిధానం ద్వారా నిర్వహించడం
4. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య సహాయ సహాకారాలు కొనసాగించాలి
5. భారత్, చైనా రైల్వే సంస్థల మధ్య నిర్వహణ విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం
6. రెండు దేశాల మధ్య విద్యకు సంబంధించిన విధానాలను పరస్పరం అవలంభించడం
7. ఖనిజాలు, గనుల రంగాలలో పరస్పరం సహకరించుకోవడం
8. అంతరిక్ష సంబంధ విషయాలలో మైత్రి కొనసాగించడం
9. భారత్ దిగుమతి చేసుకుంటున్న రేప్ సీడ్ ఉత్పత్తులపై సురక్షిత మార్గదర్శకాలు
10. దూరదర్శన్, సీసీటీవీల మధ్య ప్రసార సంబంధమైన అంశంపై ఒప్పందం
11. ఇరు దేశాలు కలిసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం
12. రాజకీయ, మిలటరీ, ఆర్థిక సంబంధమైన అంశాలను అభివృద్ధి చేసుకునేందుకు రెండు దేశాలు కలిసి సంస్థలను నెలకొల్పడం
13. నీతి ఆయోగ్, డెవలప్ మెంట్ రీసెర్చ్ సెంటర్ మధ్య పరస్పర అవగాహన
14. భూకంప విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ రంగాలలో పరస్పర సహకారం
15. వాతావరణ మార్పులు, సముద్ర విజ్ఞాన శాస్త్రం అంశాలపై అంగీకారం
16. భూ విజ్ఞాన శాస్త్రం రంగానికి సంబంధించి ఒప్పందం
17. రాష్ట్రాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల నేతల నిమామకాలపై పరస్పర అవగాహన
18. భారత్, చైనా దేశాలలో ఉన్న రాష్ట్రాలు, మునిసిపాలిటీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుకోవడం
19. చైనాలోని సిచువాన్, భారత్ లోని కర్ణాటక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు
20. తమిళనాడులోని చెన్నై, చైనాలోని చోంగ్జింజ్ నగరాల మధ్య లావాదీవిలకు సంబంధించి అవగాహనా ఒప్పందం
21. హైదరాబాద్, చైనాలోని గింగ్డౌ నగరాల మధ్య స్నేహపూర్వక వర్తక, వ్యాపార అంశంపై పరస్పర ఒప్పందం
22. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, చైనాలోని డున్హువాంగ్ నగరాల మధ్య వ్యాపార ఒప్పందం
23. ఐసీసీఆర్, ఫుడాన్ విశ్వవిద్యాలయాలం మధ్య సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ ఏర్పాటుకు ఒప్పందం
24. భారతీయ యోగా విద్యను చైనాలోని కుమ్నింగ్ కాలేజీలో ప్రవేశపెట్టేందుకు ఇరుదేశాల మధ్య సమ్మతి