బీజింగ్: చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది. వారసునిపై ఎటువంటి స్పష్టమైన సూచనలు చేయకుండా జిన్‌పింగ్‌కు రెండోసారి పార్టీ పగ్గాలను అప్పగించింది. బీజింగ్‌లోని గ్రాండ్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్.. జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెంట కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని లీ కెకియాంగ్, వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే కొత్త పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సభ్యులను జిన్‌పింగ్ మీడియాకు పరిచయం చేశారు.
జిన్‌పింగ్, కెకియాంగ్ కాక రూలింగ్ కౌన్సిల్‌లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్(63) చోటు దక్కించుకున్నారు. 2022లో జరిగే తదుపరి కాంగ్రెస్‌లో వీరిలో ఎవరూ జిన్‌పింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదని వీరి వయసును బట్టి తెలుస్తోంది. వారం పాటు కొనసాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్‌తో ముగిసింది. చివరిరోజైన మంగళవారం జిన్‌పింగ్ పేరు, సిద్ధాంతాలకు పార్టీ రాజ్యాంగంలో చోటు కల్పిస్తూ సీపీసీ కాంగ్రెస్ సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆధునిక చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, మాజీ అధ్యక్షుడు డెంగ్ జియాయోపింగ్‌తో సమాన స్థాయిని జిన్‌పింగ్‌కు కల్పించింది.
2021లో సీపీసీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోనుంది. కొత్త కమిటీని మీడియాకు పరిచయం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ చైనాతో పాటు ప్రపంచంపై తన విజన్ గురించి వివరించారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకు వెళుతోందో వివరించారు. నమ్మకం, ఆత్మగౌరవంతో చైనా ప్రజలు ముందడుగు వేస్తున్నారని, మానవాళి శాంతి, అభివృద్ధి కోసం ఇతర దేశాలతో కలసి ముందుకు వెళతామని చెప్పారు. దేశాన్ని పురోగతివైపు నడిపించడానికి సీపీసీ సానుకూల శక్తిని అందించిందని చెప్పారు. కాగా, జిన్‌పింగ్ మూడో పర్యాయం కూడా దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment