Shi jinping
-
వాణిజ్య యుద్ధానికి బ్రేక్
బీజింగ్/ఒసాకా: అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు అంగీకరించారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం పరిష్కారమయ్యేవరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. ‘చైనాతో శత్రుత్వం లేదు. అమెరికా–చైనాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నా’ అని ట్రంప్ చెప్పినట్లు చైనా అధికార పత్రిక ‘చైనా డైలీ’ తెలిపింది. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని వెల్లడించింది. ట్రంప్‌తో భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందిస్తూ..‘పరస్పరం సహకరించుకుంటే అమెరికా–చైనాలు లబ్ధి పొందుతాయి. కానీ గొడవలకు దిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి’ అని చెప్పినట్లు చైనా డైలీ పేర్కొంది. అమెరికాతో ఉన్న 539 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ గతంలో చైనాను డిమాండ్ చేశారు. అలాగే అమెరికా కంపెనీల మేధోపరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు చెందిన వాణిజ్య బృందాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది. అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా తమకు నష్టం జరుగుతోందని గుర్తించిన ఇరుదేశాలు తాజాగా సయోధ్యకు ముందుకొచ్చాయి. హలో చెప్పాలని ఉంది ‘మీ ఇంటికొస్తా. మీ భూభాగంలో అడుగు పెడతా. హలో అని పలకరిస్తా. కరచాలనం చేస్తా. రెండు నిమిషాలు మాట్లాడినా చాలు’ అని ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కి ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ట్రంప్ ట్విట్టర్లో చర్చలకు రమ్మంటూ కిమ్‌ని ఆహ్వానించడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
చైనా భూగర్భంలో ఉక్కు గోడ
బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి. సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు. -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
చైనా అధ్యక్షుడితో ఉత్తర కొరియా నియంత కిమ్
-
అణు నిరాయుధీకరణకు ఓకే
వాషింగ్టన్/బీజింగ్: ఉత్తరకొరియాలో అణు నిరాయుధీకరణకు సమ్మతంగా ఉన్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్ రహస్య చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం కిమ్ బీజింగ్ పర్యటనకు వచ్చి, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారని చైనా అధికార మీడియా జిన్హువా వెల్లడించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు బీజింగ్‌లో కిమ్ ‘అనధికార పర్యటన’సాగించినట్లు పేర్కొంది. తన భార్యతో కలసి నాలుగు రోజుల పర్యటనకు బీజింగ్ వెళ్లిన కిమ్‌కు చైనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఆద్యంతం రహస్యంగా సాగిన ఈ పర్యటన వివరాలను కిమ్ ఉత్తర కొరియాకు వెళ్లిన తర్వాతే జిన్హువా వెల్లడించింది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనంలో జిన్‌పింగ్, కిమ్‌లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను వీరు గుర్తు చేసుకున్నారు. తాను కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాలు లేకుండా చేస్తానని కిమ్ స్పష్టం చేశారు. కాగా, ఉత్తర కొరియాలోని అణ్వాయుధాలను వదిలిపెట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఇదే మంచి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో కిమ్‌తో సమావేశమయ్యేందుకు ట్రంప్ అంగీకరించిన విషయం తెలిసిందే. -
మరో ఐదేళ్లు జిన్‌పింగ్
బీజింగ్: చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది. వారసునిపై ఎటువంటి స్పష్టమైన సూచనలు చేయకుండా జిన్‌పింగ్‌కు రెండోసారి పార్టీ పగ్గాలను అప్పగించింది. బీజింగ్‌లోని గ్రాండ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్.. జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెంట కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని లీ కెకియాంగ్, వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే కొత్త పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సభ్యులను జిన్‌పింగ్ మీడియాకు పరిచయం చేశారు. జిన్‌పింగ్, కెకియాంగ్ కాక రూలింగ్ కౌన్సిల్లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్(63) చోటు దక్కించుకున్నారు. 2022లో జరిగే తదుపరి కాంగ్రెస్‌లో వీరిలో ఎవరూ జిన్‌పింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదని వీరి వయసును బట్టి తెలుస్తోంది. వారం పాటు కొనసాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్‌తో ముగిసింది. చివరిరోజైన మంగళవారం జిన్‌పింగ్ పేరు, సిద్ధాంతాలకు పార్టీ రాజ్యాంగంలో చోటు కల్పిస్తూ సీపీసీ కాంగ్రెస్ సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆధునిక చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, మాజీ అధ్యక్షుడు డెంగ్ జియాయోపింగ్తో సమాన స్థాయిని జిన్‌పింగ్‌కు కల్పించింది. 2021లో సీపీసీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోనుంది. కొత్త కమిటీని మీడియాకు పరిచయం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ చైనాతో పాటు ప్రపంచంపై తన విజన్ గురించి వివరించారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకు వెళుతోందో వివరించారు. నమ్మకం, ఆత్మగౌరవంతో చైనా ప్రజలు ముందడుగు వేస్తున్నారని, మానవాళి శాంతి, అభివృద్ధి కోసం ఇతర దేశాలతో కలసి ముందుకు వెళతామని చెప్పారు. దేశాన్ని పురోగతివైపు నడిపించడానికి సీపీసీ సానుకూల శక్తిని అందించిందని చెప్పారు. కాగా, జిన్‌పింగ్ మూడో పర్యాయం కూడా దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
ముందు ‘సరిహద్దు’ను తేల్చాలి
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు బుధవారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గురువారం ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చల్లో చైనాతో సరిహద్దు సమస్యలను నిర్మొహమాటంగా ప్రస్తావించారు. భారత భూభాగంలోకి చైనా వైపు నుంచి చొరబాట్లు పునరావృతం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యమే ఇరు దేశాల మధ్య విశ్వాసానికి పునాది అవుతుందని స్పష్టంచేస్తూ.. సరిహద్దుకు సంబంధించి శాంతి ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. అపరిష్కృతంగా ఉన్న వాస్తవాధీన రేఖపై స్పష్టత అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు. ఇందుకు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తూ.. సరిహద్దు సమస్యలను స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా సత్వరమే పరిష్కరించుకునేందుకు చైనా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం అహ్మదాబాద్‌లో పర్యటించిన జిన్‌పింగ్ గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా లడఖ్ వద్ద చైనా సైనికులు, పౌరులు తాజాగా భారత భూభాగంలోకి చొరబాట్లకు పాల్పడుతున్న నేపధ్యంలో.. మోదీ సరిహద్దు అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలూ కొంత సేపు ఏకాంతంగా ముఖాముఖి చర్చించుకున్నారు. ప్రతినిధుల స్థాయి చర్చలూ నిర్వహించారు. వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో సహకారంపై ఒప్పందాలకు సంబంధించి మంతనాలు జరిపారు. అయితే.. చుమార్, దేమ్‌చోక్ సెక్టార్లలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తాజా చొరబాట్లు చోటు చేసుకోవటంతో వీరి చర్చలు ప్రధానంగా సరిహద్దు సంఘటనల చుట్టూతా తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని చైనా నిర్ణయించింది. దానితో పాటు మొత్తం 12 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అయితే.. ఇటీవల మోదీ జపాన్ పర్యటనలో ఆ దేశంతో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. జిన్‌పింగ్ భారత పర్యటనలో అంతకన్నా చాలా ఎక్కువ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ జపాన్ కన్నా చాలా తక్కువ స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదరటం ఆ వర్గాలను నిరాశపరిచింది. భేటీ అనంతరం చైనా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. జిన్‌పింగ్ భారత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి ఒక చరిత్రాత్మక అవకాశమని అభివర్ణించగా.. భారత్, చైనాలు ఏకం కావటం ఆసియాకు అతి పెద్ద ఘటన అని జిన్‌పింగ్ అభివర్ణించారు. ఇరుగుపొరుగు వారి మధ్య సమస్యలు ఉంటాయని.. అయితే కేవలం ఈ విభేదాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించరాదని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్ముడికి జిన్‌పింగ్ నివాళి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గురువారం ఉద యం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆయన ఆ తర్వాత రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఉదయం 9:30 గంటలకు తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న జిన్‌పింగ్ అక్కడ స్మారక చిహ్నంపై పూలగుచ్ఛం ఉంచి పది నిమిషాల పాటు గడిపారు. సందర్శకుల పుస్తకంలో జిన్‌పింగ్ మండారిన్ భాషలో వ్యాఖ్యలు రాశారు. గురువారం దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో జిన్‌పింగ్ ప్రయాణాలు, ఆయనకు వ్యతిరేకంగా టిబెటన్ల నిరసన ప్రదర్శనల ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐదేళ్లలో 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు జిన్‌పింగ్, మోదీల శిఖరాగ్ర చర్చల అనంతరం భారత్‌లో రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పా టు, రైల్వేల్లో పెట్టుబడులు పెట్టడం సహా పలు అంశాలపై రెండు దేశాలూ 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్, చైనాల మధ్య పౌర అణు ఇంధన సహకారంపై రెండు దేశాలూ చర్చలు ప్రారంభించాలని జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా నిర్ణయించినట్లు మోదీ ప్రకటించారు. ‘‘పౌర అణు ఇంధన సహకారంపై మేం చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇది ఇంధన భద్రతపై రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి మరింత ఉత్తేజాన్నిస్తుంది’’ అని ఆయన జిన్‌పింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. * భారత్ - చైనాల మధ్య ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకారంపై ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం చైనా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లు పెట్టుబడులుగా పెడుతుంది. * భారత తీర్థయాత్రికుల వార్షిక కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ మార్గంతో పాటు.. సిక్కింలోని నాథులా మార్గం ద్వారా కూడా వెళ్లేందుకు చైనాతో భారత్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సంతకాలు చేశారు. దీనిద్వారా మానస సరోవర్ యాత్రలో దూరం, సమయం, కష్టతరమైన ప్రయాణం గణనీయంగా తగ్గిపోనున్నాయి. * భారతీయ రైల్వే వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చైనా అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. రైళ్ల వేగాన్ని పెంచటం, హైస్పీడ్ రైలు మార్గాలపై సహకారానికి గల అవకాశాలను అధ్యయనం చేయటం, రైల్వే స్టేషన్ల పునర్అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలివి. * ఇరు దేశాలకు చెందిన ప్రొడ్యూసర్లు (నిర్మాతలు) తమ సృ జనాత్మక, కళాత్మక, సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ వనరులను సమీకృతం చేసుకుని ఉమ్మడిగా సినిమాలు నిర్మించేందుకు వీలుగా ఒప్పందం కుదిరింది. * సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సీమాంతర ఆర్థిక నేరాలు, కస్టమ్స్ నేరాలపై పోరాటంలో సహకారాన్ని పెంపొందించుకోవటం లక్ష్యంగా కస్టమ్స్ పరిపాలనకు సంబంధించి భారత్, చైనాలు మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. * అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవటంలో సహకారానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. * రెండు దేశాలకు చెందిన వివిధ సాంస్కృతిక సంస్థల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు మరొక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో ప్రదర్శనశాలలు, పురావస్తు సంస్థలు, కళాసాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. * ఔషధాల ప్రమాణాలు, సంప్రదాయ ఔషధాలు, ఔషధాల పరీక్షల రంగాల్లో కూడా సహకారం పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. * మహారాష్ట్రలోని ముంబై నగరానికి చైనాలోని షాంఘై నగరానికి మధ్య సహోదర సంబంధాన్ని నెలకొల్పేందుకు మరొక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజల రాకపోకలను పెంపొందిస్తుంది. చైనా అధ్యక్షుడికి దలైలామా ప్రశంసలు ముంబై: భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అనూహ్యంగా.. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నుంచి ప్రశంసలు లభించాయి. జిన్‌పింగ్ విశాల దృక్పథం ఉన్న, వాస్తవికవాది అని టిబెట్ నుంచి బహిష్కారానికి గురై భారత్‌లో ప్రవాసముంటున్న దలైలామా కీర్తించారు. సుహృద్భావమనేది విశ్వాసం ద్వారానే తేవచ్చునని.. భయం ద్వారా కాదని వ్యాఖ్యానించారు. చైనా కొత్త నాయకత్వంపై తనకు విశ్వాసముందన్నారు. భారత్‌కు స్ఫూర్తి చైనా!: ప్రణబ్ చైనా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి విందు న్యూఢిల్లీ: లడఖ్‌లో భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా, పొరపాట్లకు తావులేని చర్చల ప్రక్రియ కొనసాగాలన్న ఆశాభావాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్య సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల సామరస్య పరిష్కారాన్ని భారత్, చైనాలు కోరుకుంటున్నాయన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం ఆయన గురువారం ఒక విందును ఏర్పాటు చేశారు. చైనా సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిని చూసి భారత్ స్ఫూర్తి పొందుతోందన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. లడఖ్ నుంచి చైనా దళాల ఉపసంహరణ ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతం వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి, గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన చైనా సైనిక దళాలు గురువారం రాత్రి భారత్ భూభాగం నుంచి వెనక్కు మరలాయి. రాత్రి 9.45 నుంచి చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైందని భారత అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న భారత దళాలు కూడా క్రమంగా వెనక్కు వెళ్తున్నాయని తెలిపాయి. చైనా దళాలు వాస్తవాధీన రేఖకు కాస్త ఆవలగానే ఉంటున్నందున భారత దళాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, చైనా సంచార జాతులైన ‘రెబో’లు భారత భూభాగంలోని దెమ్చాక్లో గత 12 రోజులుగా గుడారాలు వేసుకుని ఉంటున్న విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతోంది.