బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి.
సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment