Standing Council
-
4 వారాల్లోగా లీగల్ ఫీజులు చెల్లించాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల తరఫున హైకోర్టు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన న్యాయవాదులకు లీగల్ ఫీజులు/గౌరవ వేతనం సకాలంలో చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజులను 4 వారాల్లో చెల్లించాలని 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఇక నుంచి వారి ఫీజులను బిల్లులు సమర్పించిన 4 వారాల్లో లేదా 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నెల తర్వాత చెల్లించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో సేవలందిస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో లీగల్ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన సీహెచ్ వేదవాణి తనకు చెల్లించాల్సిన లీగల్ ఫీజులను చెల్లించడంలేదంటూ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఫీజులను చెల్లించాలని అధికారులను ఆదేశించింది. వారు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వేదవాణి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ విచారించారు. విచారణ సందర్భం గా ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సకాలంలో లీగల్ ఫీజులు అందక పడుతున్న ఇ బ్బందులు న్యాయమూర్తి దృష్టికి వచ్చాయి. దీంతో తనకున్న విచక్షణాధికారంతో ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతపరిచి ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ అందరికీ వర్తించేలా తీర్పునిచ్చారు. కోర్టుకెక్కే పరిస్థితి తేవద్దు ‘ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం, ఇతర విభాగాలు బిల్లులను మాత్రం సకాలంలో చెల్లించడంలేదు. వారూ కుటుంబాల సంక్షేమాన్ని చూసుకోవాలి. ఓ కార్యాలయాన్ని, గ్రంథాలయాన్ని, సహచరులను, సిబ్బందిని నిర్వహించాలి. సకాలంలో లీగల్ ఫీజులు చెల్లించకపోతే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజు కోసం హైకోర్టులో పిటిషన్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేసే పరిస్థితి వారికి తీసుకురావద్దు. రాజకీయ కారణాలతో కూడా ఫీజుల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం జరుగుతోందన్న ఆరోపణ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారి ఫీజులు ఆపుతున్నారన్న ఆరోపణ నిజమైతే అది సమంజసం కాదు. వారు సేవలందించింది రాష్ట్రానికే తప్ప వ్యక్తులకు కాదు. పాలకులు వస్తూ పోతూ ఉంటారు. రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. సకాలంలో ఫీజులు పొందే హక్కు అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాది, స్టాండింగ్ కౌన్సిల్ సహా అందరికీ ఉంది’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో స్పష్టం చేశారు. -
మరో ఐదేళ్లు జిన్‌పింగ్
బీజింగ్: చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది. వారసునిపై ఎటువంటి స్పష్టమైన సూచనలు చేయకుండా జిన్‌పింగ్‌కు రెండోసారి పార్టీ పగ్గాలను అప్పగించింది. బీజింగ్‌లోని గ్రాండ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్.. జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెంట కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని లీ కెకియాంగ్, వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే కొత్త పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్న మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సభ్యులను జిన్‌పింగ్ మీడియాకు పరిచయం చేశారు. జిన్‌పింగ్, కెకియాంగ్ కాక రూలింగ్ కౌన్సిల్లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్(63) చోటు దక్కించుకున్నారు. 2022లో జరిగే తదుపరి కాంగ్రెస్‌లో వీరిలో ఎవరూ జిన్‌పింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదని వీరి వయసును బట్టి తెలుస్తోంది. వారం పాటు కొనసాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్‌తో ముగిసింది. చివరిరోజైన మంగళవారం జిన్‌పింగ్ పేరు, సిద్ధాంతాలకు పార్టీ రాజ్యాంగంలో చోటు కల్పిస్తూ సీపీసీ కాంగ్రెస్ సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆధునిక చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, మాజీ అధ్యక్షుడు డెంగ్ జియాయోపింగ్తో సమాన స్థాయిని జిన్‌పింగ్‌కు కల్పించింది. 2021లో సీపీసీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోనుంది. కొత్త కమిటీని మీడియాకు పరిచయం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ చైనాతో పాటు ప్రపంచంపై తన విజన్ గురించి వివరించారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకు వెళుతోందో వివరించారు. నమ్మకం, ఆత్మగౌరవంతో చైనా ప్రజలు ముందడుగు వేస్తున్నారని, మానవాళి శాంతి, అభివృద్ధి కోసం ఇతర దేశాలతో కలసి ముందుకు వెళతామని చెప్పారు. దేశాన్ని పురోగతివైపు నడిపించడానికి సీపీసీ సానుకూల శక్తిని అందించిందని చెప్పారు. కాగా, జిన్‌పింగ్ మూడో పర్యాయం కూడా దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
పొరపాటు ప్రశ్నలు తొలగించి ఫలితాలు ప్రకటించొచ్చు
2011 గ్రూప్1 మెయిన్స్ పేపర్-5పై స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌లో నిర్వహించిన 2011 గ్రూప్-1 మెరుున్స పరీక్షల్లో పేపర్-5లో దొర్లిన తప్పుడు ప్రశ్నలను తొలగించి ఫలితాలు ప్రకటించవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సూచించింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షలోని పేపర్-5లో 42.5 మార్కులకు సంబంధించిన వివిధ ప్రశ్నల్లో తప్పులు దొర్లారుు. వీటిపై అభ్యంతరాలు రావడంతో నిపుణుల కమిటీ సలహాను కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రశ్నలను మొత్తంగా తొలగించి తక్కిన ప్రశ్నల మార్కులను వందశాతానికి పెంచి ఫలితాలు ప్రకటించవచ్చని స్టాండింగ్ కౌన్సిల్ కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. దీనివల్ల న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఉండవని పేర్కొంది. నివేదిక రావడంతో 2011 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. కమిటీకి స్క్రీనింగ్ టెస్టు అభ్యంతరాలు రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని 748 అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నవంబర్‌లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి కమిషన్ ఇటీవల కీ విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చారుు. వీటిని పరిశీలించే బాధ్యతను కమిషన్ నిపుణుల కమిటీకి అప్పగించింది. నిపుణుల కమిటీ నివేదిక త్వరలోనే రానుందని, ఆ వెంటనే స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు వెల్లడిస్తామని చైర్మన్ చెప్పారు. డిసెంబర్ 29, 30 తేదీల్లో ఏఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. గ్రూప్-3, గ్రూప్-1 పోస్టులకు సంబంధించి కొంత సమాచారం రావలసి ఉందని, డిసెంబర్ 15లోగా వాటిని రప్పించి నోటిఫికేషన్లు వెలువరిస్తామంది. -
ఎస్కేయూలో పచ్చ నియామకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికార పార్టీ నేతల అభీష్టాలను నెరవేర్చేందుకు జిల్లాలో అధికారులు ‘రాజును మించిన రాజభక్తి’ చూపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులను దెబ్బ తీస్తూ.. తెలుగు తమ్ముళ్లను అందలం ఎక్కించే ప్రక్రియ జిల్లాలో స్టోర్ డీలర్ల నుంచి యూనివర్సిటీ న్యాయవాదుల నియామకం వరకూ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవు.. చట్టాలు, విధి విధానాలు, నియమ నిబంధనలు.. వేటీనీ ఖాతరు చేయకుండా అధికార గణం తమ రాజభక్తిని చాటుకుంటోందనేందుకు ఇటీవల శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన ‘స్టాండింగ్ కౌన్సిల్’ నియామకం ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ తరఫున వచ్చే న్యాయ వివాదాలను హైకోర్టులో వాదించేందుకు జే.ఉగ్రనరసింహను స్టాండింగ్ కౌన్సిల్గాగత ప్రభుత్వం నియమించింది. ఈయన కాల పరిమితి మూడేళ్లు. ఈ గడువు ముగియగానే తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఉగ్రనరసింహనే స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగాలని యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను ఈ పోస్టుపై పడింది. గత ప్రభుత్వ హయాంలో నియమితమైన ఉగ్రనరసింహను తొలగించి ఆ స్థానంలో గతంలో చంద్రబాబు హయాంలో (1998-2005) యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన పి.శ్రీరాములు నాయుడును తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతల అభీష్టాన్ని నెరవేర్చే పనిలో యూనివర్సిటీ అధికారులు తమ పరిధికి మించి వ్యవహరించారు. ఉగ్రనరసింహను తొలగిస్తూ, ఆ స్థానంలో శ్రీరాములు నాయుడిని నియమిస్తూ రిజిస్ట్రారే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఉగ్రనరసింహం యూనివర్సిటీ కేసులను సరిగా వాదించడం లేదని, ఇతని ఉదాసీనత కారణంగా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణాల రీత్యా ఇతని స్థానంలో శ్రీరాములు నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కు, అడ్వకేట్ జనరల్‌కు పంపారు. అడ్వకేట్ జనరల్ ఘాటు లేఖ.. యూనివర్సిటీ అధికారుల నిర్వాకంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తీవ్రంగా స్పందిస్తూ ఘాటుగా లేఖ రాశారు. జీవో ఆర్టీ నెం 168 ప్రకారం యూనివర్సిటీలతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలు చేపట్టే అధికారం ఉండదని, అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు ప్రభుత్వం మాత్రమే వీరి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆ లేఖలో అడ్వకేట్ జనరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు స్పష్టం చేశారు. పరిధి మీరి స్టాండింగ్ కౌన్సిల్‌గా వేరే వారిని నియమించిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులకు లీగల్ నోటీసు .. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటిదాకా స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ఉగ్రనరసింహ యూనివర్సిటీ అధికారులకు లీగల్ నోటీసు పంపారు. యూనివర్సిటీ కేసులు వాదించడంలో అలసత్వం వహిస్తున్నట్లు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దిద్దుబాటు చర్యలు .. తమ ఇష్టానుసారం స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించుకోవాలనుకున్న యూనివర్సిటీ అధికారుల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.దశరథరామయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. సమస్య పరిష్కారమయ్యే దశలో ఇప్పుడీ వార్త ప్రచురించడం ఎందుకంటూ సలహా ఇచ్చారు. ఉగ్రనరసింహం పదవీ కాలం 2013 నవంబర్‌లో ముగిసిందని, అప్పుడు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు యూనివర్సిటీనే ఇచ్చిందన్నారు. తామిచ్చిన పదవీ పొడగింపు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతున్నప్పుడు ఆయనను తొలగించే అధికారం తమకు ఎందుకుండదంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు.