మనిషి మొదటి స్థిర నివాసం అక్కడే..
సిడ్నీ: మానవుడు మొట్టమొదటగా స్థిర నివాసాలు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా ‘ఆఫ్రికా’ అని చెప్పేవారు. కానీ అంతకు ముందే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు తాజాగా ఆస్ట్రేలియాలో బయటపడ్డాయి. వీటి ప్రకారం కనీసం 65,000 సంవత్సరాల కిందటే మానవుడు కంగారూల ప్రాంతంలో సెటిల్ అయ్యాడనే నిర్ధారణకు వచ్చారు.
ఇప్పటిదాకా మానవుల స్థిర నివాసానికి సంబంధించి లభించిన బలమైన ఆధారాల ప్రకారం.. 47,000 సంవత్సరాల కిందటి నుంచే మనిషి స్థిర నివాసమేర్పర్చుకొని బతుకుతున్నాడు.అయితే ఆస్ట్రేలియాలోని ఓ ఇసుకరాతి నివాసాన్ని పరిశీలించిన తర్వాత అది 65,000 సంవత్సరాల కింద నిర్మించినట్లు గుర్తించారు. ఈ నివాసం ఉత్తర ఆస్ట్రేలియాలోని జబిలుకా మైనింగ్ ప్రాంతంలో బయటపడింది. ఇప్పటిదాకా బయటపడిన ఆధారాలతో పోలిస్తే ఇది 18,000 సంవత్సరాలు పురాతనమైనదని, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నదానికంటే 5,000 సంవత్సరాల ముందు కాలానికి చెందినదని తాజా పరిశోధన రుజువు చేసింది.