
ఘోర రైలు ప్రమాదం: 53 మంది దుర్మరణం
ఎసెకా: ప్రదాన రోడ్డు మార్గంలోని ఓ బ్రిడ్జి కూలిపోవడంతో వారంతా రైలును ఆశ్రయించారు. అసలు సామర్థ్యానికి రెండింతలు ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపై ఒకటి కుప్పలా పేరుకుపోయాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం కామెరూన్ లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 53 మంది దుర్మరణం చెందారు. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
యాండీ నుంచి దౌలా నగరానికి 1300 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు.. మార్గం మధ్యలో ఎసెకా పట్టణం వద్ద ప్టటాలు తప్పిందని, స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని కామెరూన్ రవాణ శాఖ మంత్రి ఎడ్గార్ అలియాన్ మెబే మీడియాకు వెల్లడించారు. సహాయక బృందాలే ఘటనాస్థలానికి చేరుకున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు.
ఓవర్ లోడ్ వల్ల రైలు పడిపోతుందా?
కామెరూన్ పశ్చిమ ప్రాంతంలోని యాండీ పట్టణం నుంచి ఆ దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించే దౌలా నగరానికి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతుంటాయి. కాగా ఆ పట్టణాలకు కలుపుతూ నూతనంగా భారీ హైవేను నిర్మిస్తున్నారు. గురువారం హైవేపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒకటి కూలిపోవడంతో ప్రజలు రైలు మార్గాన్ని ఆశ్రయించారు. ప్రమాదానికి గురైన రైలులో.. సాధారణ రోజుల్లో తొమ్మిది బోగీలతో గరిష్టంగా 600 మంది ప్రయాణించేవారు. అయితే శుక్రవారం రద్దీ ఎక్కువ ఉండటంతో తొమ్మిది బోగీలకు మరో ఎనిమిది అదనపు బోగీలను కలిపి మొత్తం 17 బోగీల ద్వార 1300 మంది ప్రయాణికులతో రైలును నడిపారు. ఒవర్ లోడ్ వల్లే రైలు పట్టాలు తప్పిఉంటుందని ప్రకటించలేదు. కానీ అలా జరిగే అవకాశం లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.