ఆమె రూటే వేరు..
ముంబై: ఆమె రూటే వేరు. 21 ఏళ్లకే పెళ్లిళ్ల పేరమ్మ అవతారం ఎత్తింది. ‘వాంటెడ్ అంబరెల్లా’ పేరిట మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అది అలాంటి ఇలాంటి మ్యారేజ్ బ్యూరో కాదు. వికలాంగులు, అంధులు, బదిరులు, బుద్ధిమాంద్యంతో బాధపడేవారికి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేయడమే ఆ బ్యూరో లక్ష్యం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం తదితర బేధాలేవీ ఉండవు. ఆ మాటకొస్తే దేశాల సరిహద్దులతోనూ సంబంధం లేదు.
బాహ్య సౌందర్యం కాకుండా ఆత్మ సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చి, అభిరుచులకు తగినట్టుగా ఆడ,మగలకు సంబంధాలు కుదుర్చిపెడుతుందీ బ్యూరో. బ్యూరోను ఏర్పాటుచేసి ఏడాది తిరిగకముందే ఆమె అంబరెల్లా మ్యారేజీ బ్యూరో వద్ద వేలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఆడ,మగ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనసిచ్చి మాట్లాడుకోవడానికి బ్యూరో అధినేత కళ్యాణి కోన... అప్పుడప్పుడు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పడు తమ బ్యూరోలో చేరిన వారు పరస్పరం మరింత అర్థం చేసుకోవడానికి వీలుగా ‘లవెబిలిటీ’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు 22 ఏళ్ల కల్యాణి ఖోనా వెల్లడించారు.
ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న కళ్యణి అంతటితో చదువుకు స్వస్తి చెప్పి నాలుగు చోట్లకు తిరుగుతూ నలుగురిని కలుసుకునే అవకాశమున్న ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నట్లుగానే మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పటికే అలాంటివి ఎన్నో ఉండడంతో పోటీ తట్టుకోవడం కష్టమని భావించారు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. అదే సమయంలో భారత్‌లో 80 లక్షల మంది అంగవికలురుంటే వారిలో కేవలం ఐదు శాతం మందికి మాత్రమే పెళ్లిళ్లు అవుతున్నాయని, మిగతా వారంతా పెళ్లిళ్లు చేసుకోకుండానే జీవితాలు ముగిస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించిన అంశాన్ని పత్రికలో చూసి, అసలు వారి పెళ్లిళ్ల కోసమే ఓ ప్రత్యేక మ్యారేజ్ బ్యూరో ఎందుకు ఏర్పాటు చేయకూడదన్న ఆలోచన వచ్చిందట.
అంతే. గత ఏడాది ఆ ఆలోచనను అమల్లో పెట్టారు. తన బ్యూరో ఒక్క రాష్ట్రానికో, ఒక్క దేశానికో పరిమితం కాకూడదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానని చెప్పారు. అంధులు, బదిరులకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా తమ ‘లవెబిలిటీ’ యాప్‌ను రూపొందిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్నే దీనిలో ఉపయోగిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమ ఈ ప్రాజెక్టు తొలిదశలోనే ఉందని, దీనికి అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని ఆమె వివరించారు.
తానిదంతా ఛారిటీ కోసం ఏమీ చేయడం లేదని, తమ మ్యారేజ్ బ్యూరోలో చేరిన వారి నుంచి చార్జీలు వసూలు చేస్తానని కల్యాణి నిర్మొహమాటంగా చెప్పారు. ఛారిటీ కింద చేస్తే ఎన్జీవో సంస్థల్లాగా, ఏ ప్రాంతానికో, ఓ స్థాయికో పరిమితం కావాల్సి వస్తుందని, తనకు ఆ ఉద్దేశం లేదని,వీలైనంతగా సమాజంలో చొచ్చుకుపోవాలన్నదే తన లక్ష్యమని ఆమె వివరించారు.