హిందూ వివాహాల్లో పెళ్లి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు, వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. ఇదివరకు బంధువులు, పరిచయస్తులు మధ్యవర్తిగా ఉండి ఇరు కుటుంబాల వారికీ అమ్మాయి, అబ్బాయిని చూపించి.. పెళ్లి సంబంధాలు కుదుర్చేవారు. అయితే చదువు పూర్తిచేసి.. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వయసు దాటిన తర్వాత పెళ్లికి సిద్ధమైతే వధువు దొరకడం లేదు. ఇటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని రాజమండ్రికి చెందిన కొంతమంది మ్యారేజ్ బ్యూరో పేరుతో రంగంలోకి దిగుతున్నారు. ఫొటో ఒకరిది చూపి.. డబ్బు రాబట్టుకుని.. పెళ్లి మరొకరితో చేయడానికి ప్రయత్నిస్తూ.. వరుడి తరఫు కుటుంబాలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎంతోమంది యవకులు వయసు మీదపడుతున్నా కల్యాణ గడియలు కలసిరావడం లేదు. అమ్మాయిలు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలోనూ మార్పు వచ్చింది. ఉన్నత చదువు.. మంచి ఉద్యోగం.. మెరుగైన వేతనం.. ఆస్తిపాస్తులు.. కుటుంబ నేపథ్యం బాగుండాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తెల అభిప్రాయానికి విలువనిచ్చి.. అలాంటి వారిని ఎంపిక చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో పలు వ్యాపారాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, వ్యవసాయ రంగాల యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. ఎంతలా అంటే కన్యాశుల్కం అంటే.. అమ్మాయికే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అమ్మాయిలు దొరక్క విసిగివేసారిపోయిన యువకులు, వారి తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. కొందరు బ్యూరో నిర్వాహకులు డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోక తప్పదని పలు ఘటనలు హెచ్చరిస్తున్నాయి.
మ్యారేజ్ బ్యూరో మోసాల్లో మచ్చుకు...
- అనంతపురంలో నివాసం ఉంటున్న రాముడు (పేరుమార్చాం) సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. రాముడు తన సోదరుడికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి రాజమండ్రికి చెందిన మహిళా పెళ్లిళ్ల పేరయ్య (బ్రోకర్)ను సంప్రదించారు. మొదట ఒక అమ్మాయి ఫొటో చూపించారు. పెళ్లికొడుకు సమ్మతి తెలపడంతో.. రూ.5 లక్షల నగదును పెళ్లికూతురు తండ్రికి ఇవ్వాలని.. పెళ్లి నిర్వహణ పెళ్లికొడుకు వారే బాధ్యత తీసుకోవాలని బ్రోకర్ చెప్పారు. వారు ఒప్పుకుని నగదు చెల్లించారు. తర్వాత 15 రోజులకు పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి 20 మంది దాకా పెళ్లి అనుకున్న సమయానికి రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు.
- అక్కడ పెళ్లి కూతురు మారిపోయింది. తొలుత తమకు ఫొటోలో చూపించిన అమ్మాయి కాదు కదా అని పెళ్లి కుమారుడి వారు ప్రశి్నస్తే.. ‘ఆ అమ్మాయి తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. పెళ్లి చేయడం ఇప్పుడు కుదరదు. కావున ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అని మహిళా బ్రోకర్ తాపీగా సమాధానమిచ్చారు. చేసేది లేక పెళ్లి కొడుకు కుటుంబం వెనక్కు వచ్చేసింది. ఇలా పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని మోసగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లి సంబంధాలు కుదుర్చుతామంటూ వల వేసి భారీగా నగదు, బంగారు నగలు గుంజుతున్నారు. చివర్లో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు.
జిల్లాలో యువకుల గణాంకాలు
- 20 నుంచి 29 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 3,25,218
- 30 నుంచి 39 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 5,86,395
బ్రోకర్ల మాట నమ్మొద్దు
అమ్మాయిల కొరతను ఆసరాగా చేసుకుని పెళ్లిళ్ల పేరుతో కొందరు బ్రోకర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. బ్రోకర్ల వలకు చిక్కకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. రెండు కుటుంబాలు ఒక అభిప్రాయానికి వచ్చాక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకోవాలి. బ్రోకర్లను ఒక పరిధి వరకే పరిమితం చేయాలి. –మేడా రామలక్ష్మీ, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, అనంతపురం
(చదవండి: విధివంచితులు)
Comments
Please login to add a commentAdd a comment