అమ్మకాల్లో మారుతీ పరుగులు
అమ్మకాల్లో మారుతీ పరుగులు
Published Sat, Oct 1 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
ముంబై : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాల్లో దూసుకెళ్లింది. సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,49,143 యూనిట్లగా రికార్డు చేసింది. వీటిలో అత్యధికంగా దేశీయ అమ్మకాలు ఉండటం విశేషం. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకీ ఇండియా కేవలం 1,13,759 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దేశీయ అమ్మకాలు గతేడాది 1,06,083 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో 1,37,321 యూనిట్లుగా నమోదయ్యాయి. జూలై అమ్మకాలను సైతం మారుతీ సుజుకీ అధిగమించింది.
గత కొన్ని నెలలుగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మిని సెగ్మెంట్ కార్లు వాగన్ ఆర్, ఆల్టో మోడల్స్ సైతం అమ్మకాల్లో దూసుకెళ్లాయి. ఈ వాహనాలు 24.8 శాతం జంప్ అయి, 44,395 యూనిట్లుగా నమోదుచేశాయి. కాంపాక్ట్ సెగ్మెట్ కార్లు స్విఫ్ట్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్లు కూడా 12.3 శాతం ఎగిసి, 50,324 యూనిట్లను అమ్మినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ కార్లు గతేడాది కంటే అత్యధికంగా 52.5 శాతం పెరిగి 6,544 యూనిట్లుగా రికార్డుచేసినట్టు తెలిపింది. వాణిజ్య వాహనాలు, ఎగుమతులు కూడా సెప్టెంబర్ నెలలో ఎగిసినట్టు వెల్లడించింది.
Advertisement