న్యూయార్క్‌లో పట్టాలు తప్పిన మెట్రో రైలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బ్రాంక్స్ ప్రాంతంలో మెట్రో నార్త్‌కు చెందిన ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా 67 మంది గాయపడ్డారని న్యూయార్క్ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తున్న రైలు బ్రాంక్స్ ప్రాంతంలోని స్పైటెన్ డ్వైవిల్ స్టేషన్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు పట్టాలు తప్పినట్టు తెలిపారు.
ఈ ఘోర దుర్ఘటనలో రైలుకున్న 8 బోగీల్లో ఆరు బోగీలు చెల్లాచెదురయ్యాయని, వీటిలో ఒక బోగీ సమీపంలోని హార్లెం నదికి ఒక్క అడుగు దూరంలో పడి ఆగిందని వివరించారు. పోలీసులు దాదాపు 100 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారని అదేవిధంగా ఈతగాళ్లు నదిలో ఎవరైనా పడ్డారేమోనని గాలింపు చేపట్టారని వివరించారు. అత్యంత ప్రమాద కరమైన మలుపుగుండా రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం సంభవించినట్టు సీఎన్‌ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. రైలు ఎక్కువ వేగంగా ప్రయాణించినందునే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ఓ ప్రయాణికుడు తెలిపాడు.ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు.