కశ్మీర్లోని ఓ బ్యూటీ పార్లర్ (ఇన్సెట్లో ఉర్దూ భాషలో ఉగ్రవాదుల వాల్పోస్టర్)
జమ్ము: అప్పుడెప్పుడో ఆఫ్ఘనిస్థాన్ కొండల్ని దాడి కశ్మీర్లోయలోకి ప్రవేశించిన తాలిబన్ విష సంస్కృతి మళ్లీ బుసలు కొడుతోంది. మహిళలు, విద్యార్థినుల వస్త్రధారణ, నడతను నిర్దేశిస్తూ ఉగ్రవాదులు జారీచేసిన హెచ్చరికల రూపంలో అది మరోసారి బయటపడింది.
'అమ్మాయిలెవ్వరూ బురఖా ధరించకుండా బయటికి రావద్దు. అది లేకుండా బడికి, కాలేజీకి వచ్చేవాళ్లను ఉపేంక్షిచొద్దు' అంటూ హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థ పేరుతో పుల్వామా పట్టణంలోని అన్ని విద్యాసంస్థలవద్ద వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బ్యూటీపార్లర్లన్నీంటినీ 24 గంటల్లోగా మూసేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇక మగవాళ్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే మద్యం, డ్రగ్స్ తీసుకునే అలవాట్లున్నవాళ్లు వెంటనే మానేయాలని పిలుపునిచ్చారు.
కలకలంరేపిన ఈ పోస్టర్ల ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పనులు ఎవరు చేసినా ఆక్షేపణీయమేనని పుల్వామా సీనియర్ ఎస్పీ తేజిందర్ సింగ్ అన్నారు. నిందుతుల్ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కశ్మీర్ లో ఇలా మహిళల వస్త్రధారణను నిర్ధేశిస్తూ పోస్టర్లు అంటించిన ఉదంతాలు గతంలోను పలుమార్లు వెలుగులోకి వచ్చాయి.