- డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో విదేశీ పద్ధతికి రాంరాం
- ప్రస్తుతానికి సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలని ప్రభుత్వం ఆదేశం
- ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిని ప్రజలు ఆమోదించరంటూ కొత్త మెలిక
- పాత పద్ధతిలో చేయాలంటే ఖర్చు పెరుగుతుందంటున్న అధికారులు
- వరంగల్ టెండర్లలో కాంట్రాక్టర్ల కొటేషన్లే నిదర్శనమని వ్యాఖ్య
- గందరగోళంగా ‘డబుల్’ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మరో మలుపు. ఇళ్ల నిర్మాణాన్ని ఆధునిక పద్ధతిలో చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది. నిర్మాణంలో మైవాన్ పరిజ్ఞానాన్ని వినిగియోగించుకోవాలనే యోచనను పక్కన పెట్టేసింది. సంప్రదాయ విధానానికే మొగ్గుచూపింది. ఈ సంవత్సరం చేపట్టనున్నట్టు ప్రకటించిన 60 వేల ఇళ్లను స్థానిక సంప్రదాయ నిర్మాణ పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణాల కోసం పిలిచే టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకే అవకాశం కల్పించేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో చేపట్టబోయే ఇళ్ల నిర్మాణం కోసం స్థానికంగా నమోదు చేసుకున్న కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేయటం గమనార్హం.
రోజుకో ఆలోచన.. పూటకో నిర్ణయం
రెండు పడక గదుల ఇళ్ల విషయంలో గత జూన్ 2న తొలిసారి సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేదికపై ఆయన ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి నిర్మాణంపై రోజుకో మాట, పూటకో నిర్ణయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారీ సంఖ్యలో, అధిక వ్యయంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నందున ఖజానాపై భారాన్ని తగ్గించుకునే క్రమంలో గంపగుత్త నిర్మాణ పద్ధతిని అనుసరిస్తామని వెల్లడించింది. అవసరమైతే గ్లోబల్ టెండర్లకు వెళ్తామని చెప్పింది. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతోపాటు, త్వరగా పనులు పూర్తి కావటం, మన్నిక ఎక్కువగా ఉండేందుకు విదేశాల్లోని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ పద్ధతి అయిన మైవాన్ పరిజ్ఞానంతో పనులు చేపట్టనున్నట్టు స్వయంగా సీఎం వెల్లడించారు. ఆ పరిజ్ఞానంతో పనులు చేపట్టిన కంపెనీలతో అధికారులు చర్చలు కూడా జరిపారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో లబ్ధిదారులే వారివారి స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునేలా కాకుండా ప్రభుత్వం సేకరించిన ప్రాంతంలో కాలనీలుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదిలోనే నిర్ణయించారు. ఒకేచోట ఇళ్ల నిర్మాణం జరిగితే నిర్మాణ సంస్థకు పనులు చేయడం సులభం. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ప్రస్తుతం గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షల చొప్పున యూనిట్‌కాస్ట్‌ను నిర్ధారించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ధరతో నిర్మాణం చాలా కష్టం.
కానీ అది జరగాలంటే స్థానిక సంప్రదాయ పద్ధతి కాకుండా, ప్రస్తుతం వంతెనల నిర్మాణంలో అనుసరిస్తున్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతే అనుసరించాలి. కానీ ఉన్నట్టుండి మనసు మార్చుకున్న ప్రభుత్వం అధిక వ్యయమయ్యే సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తుందో అధికారులకే అంతుచిక్కటం లేదు. తాజాగా ఆ యూనిట్ కాస్ట్‌తో నిర్మాణం సాధ్యం కాదన్నట్టుగా వరంగల్‌లో కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేయడమే ఇందుకు నిదర్శనం. మరి ఏకంగా 60 వేల ఇళ్లను ఎలా నిర్మిస్తారో అంతుచిక్కని పరిస్థితి.
అంతా గందరగోళం
మైవాన్ లాంటి కొత్త పద్ధతులు స్థానిక ప్రజలకు పరిచయం లేనందున, వారు అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సంప్రదాయ పద్ధతిలోనే పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం నిర్మించనున్న 60 వేల ఇళ్లకు పాత పద్ధతిని అనుసరించి, ఆ తర్వాత భారీ మొత్తంలో నిర్మించే ఇళ్లకు మైవాన్‌ను వినియోగిస్తామంటోంది. కానీ ఇప్పుడు అనుమానపడే గ్రామీణులు ఆ తర్వాత ఎలా అంగీకరిస్తారో మరి. కొన్ని పాత పద్ధతిలో, మరికొన్నింటిని మైవాన్ పరిజ్ఞానంతో నిర్మిస్తే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
‘మైవాన్’కు మంగళం
Published Mon, Oct 19 2015 3:11 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Advertisement