కదిలిన ఎమ్మెల్యే సోలిపేట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుబ్బాక: నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ‘వైద్య విధ్వంసం’పై వస్తున్న వరుస కథనాలు రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని కదిలించాయి. రెండురోజులుగా ఆయన దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే మకాం వేసి.. అక్కడి పరిస్థితి, కావాల్సిన మౌలిక వసతులను పరిశీలించారు. తన నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులను అక్కడికే పిలిపించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కోసం తన వంతుగా రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా తలో చేయి వేసి రూ.5 లక్షలు పోగేశారు. ముందుగా ఆసుప్రతి ఆపరేషన్ థియటర్‌కు అవసరమైన పరికరాలు తెప్పించారు. ఆపరేషన్ థియేటర్‌లో వైరస్ సోకకుండా వాల్ కోటింగ్ వేయించారు. థియేటర్‌కు, ప్రసూతి వార్డుకు మూడు ఏసీలు అమర్చారు. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు తెప్పించారు. పాడైపోయిన ఫ్యాన్లను రిపేర్ చేసి పునరుద్ధరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ కోసం మంత్రి హరీశ్‌రావు సహకారంతో తన నియోజకవర్గం పరిధి వరకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సోలిపేట నిర్ణయించారు.
‘సాక్షి’ కథనాలు నూటికి నూరుపాళ్లు నిజం: సోలిపేట
‘‘మా ప్రాంతంలో అంతా పేదలే. గర్భిణిలు ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వైద్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు నూటికి నూరుపాళ్లు నిజం. నిజంగా నన్ను కదిలించాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన పేషంట్లను కబేళాలకు తరలించిన పశువుల్లా చూస్తున్నారు. నేను తొలినుంచీ దుబ్బాక కమ్యూనిటీ ఆసుప్రతి అభివృద్ధికి కృషి చేస్తున్నా. ‘సాక్షి’ కథనాలతో పనులు వేగం పెంచాం. రాష్ట్రంలోనే దుబ్బాక పీహెచ్‌సీని నెంబర్‌వన్ చేయాలనేది నా లక్ష్యం.