మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
Published Sat, Jul 1 2017 4:02 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఐతే ఈ పర్యటనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని ప్రాధాన్యం ఇస్తోంది. వాస్తవానికి ఓ ప్రధాని ఓ దేశానికి వెళ్లడం సాధారణమే. కానీ ఇజ్రాయెల్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఎందుకంటే?..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 4న ఇజ్రాయెల్‌కు వెళ్తున్నారు. అక్కడ ఆయన మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యముంది. ఇజ్రాయెల్-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అంటే ఇజ్రాయెల్-భారత్ దౌత్య సంబంధాలకు ఇది రజతోత్సవ సంవత్సరం. అంతేకాదు ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్న తొలి భారత ప్రధానమంత్రి కూడా నరేంద్రమోదీనే. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనప్పటికీ ఇంతవరకూ ఒక్క ప్రధాని కూడా ఇజ్రాయెల్‌లో పర్యటించలేదు. పైగా 1992 వరకు కూడా ఇజ్రాయెల్‌తో మనదేశానికి దౌత్య సంబంధాలు పెద్దగా లేవు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలకు బీజాలు పడ్డాయి. దరిమిలా రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పెంపొందుతూ వచ్చాయి. తాజాగా మోదీ ఇజ్రాయెల్ టూర్‌తో ఆ బంధం మరింత బలోపేతం కానుంది. అందుకే మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
అపశ్రుతులు దొర్లకుండా..
మోదీ పర్యటనలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. భారత ప్రధానికి అద్భుత రీతిలో స్వాగతం పలకాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు, పోప్‌లు ఇజ్రాయెల్‌లో పర్యటించినపుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మోదీకి కూడా అదేవిధంగా స్వాగత సత్కారాలు చేయనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధాని ఇజ్రాయెల్‌కు వస్తున్నారంటూ నెతన్యాహూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మోదీ తనకు ప్రియమిత్రుడని, అతని రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.
అప్పుడు గుజరాత్ సీఎం హోదాలో..
నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కాదు. తొలిసారి ఆయన 2006లో ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఐతే అప్పుడు ఆయన గుజరాత్ సీఎం హోదాలో ఆ దేశంలో పర్యటించారు. ఇప్పుడు ప్రధాని హోదాలో ఆ దేశానికి వెళ్తున్నారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో అతి ముఖ్యమైన దేశం ఇజ్రాయెల్. మోదీ పర్యటన సందర్భంగా కీలకమైన ఆయుధ కొనుగోలుపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, బరాక్ -8 డిఫెన్స్ మిస్సైల్స్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదురనుంది. అలాగే ఫాల్కన్ లాంగ్ రేంజ్ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌పై భారత్ ఆసక్తి చూపిస్తోంది. శత్రు శిబిరాలపై దాడి చేయగల సత్తా ఉన్న 10 డ్రోన్ల కొనుగోలుకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కూడా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
నాడు ఆదుకున్నది ఇజ్రాయెలే!
పైకి కనిపించకపోయినప్పటికీ ఇజ్రాయెల్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇందుకు కార్గిల్ యుద్ధమే తార్కాణం. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో ఇండియాను సైనికపరంగా ఆదుకున్నది ఇజ్రాయెలే. నాటి యుద్ధంలో మొదట భారత్‌కు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మన మిత్రదేశాలు అనుకున్నవేవీ కూడా మనకు అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అమెరికా ఒత్తిడిని తట్టుకొని మరీ ఇజ్రాయెల్ భారత్‌కు సాయం అందించింది. ప్రత్యేకించి నిఘా వ్యవస్థలు, లేజర్ గైడెడ్ మిస్సైళ్లు, ఆటోమెటిక్ ఎయిర్ వెహికిల్స్‌ను సమకూర్చి అండగా నిలిచింది. వాటి సహాయంతో శత్రువుల జాడలు పసిగట్టి కచ్చితమైన దాడులు చేయగలింది ఇండియన్ ఆర్మీ. దరిమిలా కార్గిల్ పోరులో మనం పైచేయి సాధించాం.
కార్గిల్ వార్ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్-మనదేశం మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా రక్షణ సంబంధ విషయాల్లో ఇరు దేశాలు కలిసి పని చేశాయి. ఇప్పుడు మోదీ పర్యటనతో ఆ బంధం మరింత బలోపేతం కానుంది. అందుకే మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ హై-ప్రియారిటీ ఇస్తోంది.
Advertisement
Advertisement