isreal tour
-
హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని అల్టిమేటం
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. బందీల విడుదలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులకు లొంగిపోవడం లేదా చనిపోవడం మాత్రమే దారి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ను అంతం చేయడానికి వారు తలదాచుకున్న సొరంగాలను సముద్ర నీటితో నింపుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేసిన తర్వాతే కాల్పుల విరమణ ఉంటుందని తెలిపారు. బందీలను సురక్షితంగా పరిరక్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు గాజా నుంచి ఎప్పటికీ ముప్పు లేకుండా అయ్యే వరకు పోరాటం సాగుతుందని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ వారంపాటు కొనసాగింది. ఈ క్రమంలో హమాస్ 105 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కూడా 240 మంది పాలస్తీనా బందీలను బయటకు వదిలివేసింది. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ప్రపంచ దేశాలు అభ్యర్థించాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ ప్రతిదాడిని ప్రారంభించింది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొంత భాగాన్ని ఆక్రమించింది. హమాస్ వైపు దాదాపు 18వేల పైగా మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: చెక్ రిపబ్లిక్లో కాల్పులు.. 15 మంది మృతి -
భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు? ఏరోపోనిక్స్ టెక్నాలజీ ఘనత ఏమిటి?
అరబ్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం ఇజ్రాయెల్.. అయితే అది సాధించిన సాంకేతికత కారణంగా నేడు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఈ దేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఈ దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ పుష్కలంగా పంటలు పండటం విశేషం. అయితే భారతదేశంలోని రైతులతో ఈ దేశానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నుంచి టెక్నాలజీ విషయంలో ఇతరదేశాలతో భారత్ పోటీపడే స్థాయిలో లేదు. ఒకప్పుడు మన దేశంలో అన్ని కార్యకలాపాలు సంప్రదాయబద్ధంగా జరిగేవి. ముఖ్యంగా వ్యవసాయం విషయానికివస్తే దేశంలో సాగయ్యే వ్యవసాయంలో అధికశాతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటుంది. ఫలితంగా భారతదేశం ఈ రంగంలో భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే 1993లో ఇజ్రాయెల్, భారతదేశం వ్యవసాయ రంగంలో చేతులు కలిపినప్పటి నుంచి దేశంలోని రైతుల పరిస్థితి మరింతగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఇజ్రాయెల్ సహకారంతో 30కి పైగా వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అలవరచుకుని, అధునాతన వ్యవసాయం చేయాలనుకునే భారతీయ రైతులను శిక్షణకు ఇజ్రాయెల్ ఆహ్వానం పలుకుతుంటుంది. పలువురు భారతీయ రైతులు వ్యవసాయంలో శిక్షణకు ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ఇదే కారణం. శిక్షణ అనంతరం వారు తిరిగి భారత దేశానికి తిరిగివచ్చి తమ వ్యవసాయ ఉత్పత్తులను అనేక రెట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్ సహాయంతో ప్రస్తుతం భారతదేశంలో అనేక వ్యవసాయ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గాలిలో సాగుచేసే వ్యవసాయానికి కూడా ఇజ్రాయెల్ పేరుగాంచింది. ఈ దేశంలో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు. ఈ సాంకేతికతలో వ్యవసాయానికి భూమి లేదా నేల అవసరం లేదు. ఈ పద్ధతిలో పండించిన కూరగాయలను మట్టిలో పండే కూరగాయలతో పోలిస్తే.. వాటికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం -
ఢిల్లీ, ముంబైలలో ‘ఇజ్రాయెల్ అడ్డా’? యూదులకు ప్రత్యేక రక్షణ ఎందుకు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, చాందినీ చౌక్‌లోని చాబాద్ హౌస్ చుట్టూ పోలీసులను గట్టి నిఘా ఏర్పాటు చేశారు? ఇంతకీ చాబాద్ హౌస్ అంటే ఏమిటి? దీనితో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం ఏమిటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాబాద్ హౌస్ చరిత్రలోకి వెళితే.. 17-18 శతాబ్దంలో రష్యాలో జారిజం రాజ్యమేలుతున్నప్పుడు యూదులపై అనేక దురాగతాలు జరిగాయి. వారు వేధింపులకు గురయ్యారు. చిన్న చిన్న విషయాలకే వారిని జైల్లో పెట్టి కొరడాలతో కొట్టేవారు. దీంతో యూదులు తమ ఉనికి కోసం పోరాటం మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో లియాడీకి చెందిన రబ్బీ ష్నూర్ జల్మాన్, మరో యూదు మత నాయకుడు కలిసి చాబాద్-లుబావిచ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ఉద్దేశ్యం యూదులను ఏకం చేయడం. వారిని ఒక వేదికపైకి తీసుకురావడం. 19వ శతాబ్దంలో ఐరోపాలో ముఖ్యంగా జర్మనీలో యూదుల హోలోకాస్ట్ ప్రారంభమైనప్పుడు, రబ్బీ యోసెఫ్ యిట్జాక్ ష్నీర్సన్ నాయకత్వంలో ‘చాబాద్’ ఉద్యమం తిరిగి ఊపందుకుంది. యూదు మత పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ‘చాబాద్ హౌస్’లను తెరవడం ప్రారంభించారు. వీటి ఉద్దేశ్యం యూదు ప్రజలకు సహాయం చేయడమే. వారు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకే వీటిని ఏర్పాటు చేశారు. ‘chabad. org’లో అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోని 85కుపైగా దేశాలలో 3500 చాబాద్ హౌస్‌లు పనిచేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాబాద్ హౌస్ అనేది యూదు సమాజానికి ఒక కమ్యూనిటీ సెంటర్. ఇజ్రాయిలీలు, యూదుల కోసం చాబాద్ హౌస్‌లలో ప్రత్యేక తరగతులు, వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మతపరమైన విషయాలపై కూడా అవగాహన కల్పిస్తారు. భారతదేశంలో రెండు చాబాద్ హౌస్‌లు ఉన్నాయి. ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో ఉంది. ఇజ్రాయెలీ, యూదు పర్యాటకులు చాబాద్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇజ్రాయెలీ వంటకాలను రుచిచూడవచ్చు. 2011లో ముంబైపై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు చాబాద్ హౌస్‌పై కూడా దాడి జరిగింది. ఆ ఘటన తర్వాత ఢిల్లీ, ముంబైలలోని చాబాద్ హౌస్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది? -
ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడులతో పదుల సంఖ్యలో సామాన్యపౌరులు మృతిచెందారు. వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి 5వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. Approximate of 2000 people running from a party where hamas militants attacked #Israel #Palestine pic.twitter.com/BRiOGm7cPK — meh° (@ImMehulOkk) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ ఏర్పాటు ఇలా.. హమాస్ ఒక మిలిటెంట్ ఉద్యమం. హమాస్, హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) యొక్క సంక్షిప్త రూపం. ఇది గాజా స్ట్రిప్‌లో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లను పాలిస్తుంది. ఈ హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్‌కు సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. షేక్ అహ్మద్ యాసిన్ అనే పాలస్తీనా మత గురువు హమాస్‌ను స్థాపించాడు. డిసెంబర్ 1987లో గాజాలో హమాస్‌ను బ్రదర్హుడ్ రాజకీయ విభాగంగా యాసిన్ తయారు చేశారు. More Israelis being taken hostage. #Israel #Hamas #Palestine #Palestinian #IronDome #Gaza #TelAviv pic.twitter.com/v005TC7IC7 — Paul Golding (@GoldingBF) October 7, 2023 ఇజ్రాయెల్ నాశనమే టార్గెట్.. ఆ సమయంలో హమాస్ యొక్క ఉద్దేశ్యం పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ), ఇజ్రాయెల్‌ను హింసాత్మకంగా ప్రతిఘటించడమే లక్ష్యం. ఈ మేరకు 1988లో, హమాస్ తన చార్టర్‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి ఐదు నెలల ముందు ఏప్రిల్ 1993లో హమాస్ మొదటిసారిగా ఆత్మాహుతి బాంబు దాడిని ప్రారంభించింది. హమాస్‌కు ఎలా నిధులు సమకూరుతాయి? డజన్ల కొద్దీ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1997లో అమెరికా హమాస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హమాస్‌కు ఇరాన్ వస్తుపరంగా, ఆర్థికపరంగా సహాయాన్ని అందిస్తోంది. టర్కీ దాని అగ్ర నాయకులలో కొంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని పాలస్తీనా ప్రవాసులు మరియు ప్రైవేట్ దాతలు నిధులను అందిస్తున్నారు. అదనంగా, పశ్చిమ దేశాలలోని కొన్ని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు హమాస్ మద్దతు ఉన్న సామాజిక సేవా సమూహాలకు డబ్బును పంపిస్తున్నాయి. హమాస్ ద్వారా వందల మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ఖతార్‌కు అనుమతిస్తోంది. ఇతర విదేశీ సహాయం సాధారణంగా PA మరియు UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటుంది. 2017 నుంచి దాడులు తీవ్రం.. ఇదిలా ఉండగా.. 2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు. జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు అంటూ అప్పట్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి. కానీ, దాడులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. -
మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఐతే ఈ పర్యటనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని ప్రాధాన్యం ఇస్తోంది. వాస్తవానికి ఓ ప్రధాని ఓ దేశానికి వెళ్లడం సాధారణమే. కానీ ఇజ్రాయెల్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఎందుకంటే?.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 4న ఇజ్రాయెల్‌కు వెళ్తున్నారు. అక్కడ ఆయన మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యముంది. ఇజ్రాయెల్-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అంటే ఇజ్రాయెల్-భారత్ దౌత్య సంబంధాలకు ఇది రజతోత్సవ సంవత్సరం. అంతేకాదు ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్న తొలి భారత ప్రధానమంత్రి కూడా నరేంద్రమోదీనే. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనప్పటికీ ఇంతవరకూ ఒక్క ప్రధాని కూడా ఇజ్రాయెల్‌లో పర్యటించలేదు. పైగా 1992 వరకు కూడా ఇజ్రాయెల్‌తో మనదేశానికి దౌత్య సంబంధాలు పెద్దగా లేవు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలకు బీజాలు పడ్డాయి. దరిమిలా రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పెంపొందుతూ వచ్చాయి. తాజాగా మోదీ ఇజ్రాయెల్ టూర్‌తో ఆ బంధం మరింత బలోపేతం కానుంది. అందుకే మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అపశ్రుతులు దొర్లకుండా.. మోదీ పర్యటనలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. భారత ప్రధానికి అద్భుత రీతిలో స్వాగతం పలకాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు, పోప్లు ఇజ్రాయెల్‌లో పర్యటించినపుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మోదీకి కూడా అదేవిధంగా స్వాగత సత్కారాలు చేయనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధాని ఇజ్రాయెల్‌కు వస్తున్నారంటూ నెతన్యాహూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మోదీ తనకు ప్రియమిత్రుడని, అతని రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు. అప్పుడు గుజరాత్ సీఎం హోదాలో.. నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కాదు. తొలిసారి ఆయన 2006లో ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఐతే అప్పుడు ఆయన గుజరాత్ సీఎం హోదాలో ఆ దేశంలో పర్యటించారు. ఇప్పుడు ప్రధాని హోదాలో ఆ దేశానికి వెళ్తున్నారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో అతి ముఖ్యమైన దేశం ఇజ్రాయెల్. మోదీ పర్యటన సందర్భంగా కీలకమైన ఆయుధ కొనుగోలుపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, బరాక్ -8 డిఫెన్స్ మిస్సైల్స్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదురనుంది. అలాగే ఫాల్కన్ లాంగ్ రేంజ్ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌పై భారత్ ఆసక్తి చూపిస్తోంది. శత్రు శిబిరాలపై దాడి చేయగల సత్తా ఉన్న 10 డ్రోన్ల కొనుగోలుకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కూడా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. నాడు ఆదుకున్నది ఇజ్రాయెలే! పైకి కనిపించకపోయినప్పటికీ ఇజ్రాయెల్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇందుకు కార్గిల్ యుద్ధమే తార్కాణం. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో ఇండియాను సైనికపరంగా ఆదుకున్నది ఇజ్రాయెలే. నాటి యుద్ధంలో మొదట భారత్‌కు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మన మిత్రదేశాలు అనుకున్నవేవీ కూడా మనకు అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అమెరికా ఒత్తిడిని తట్టుకొని మరీ ఇజ్రాయెల్ భారత్‌కు సాయం అందించింది. ప్రత్యేకించి నిఘా వ్యవస్థలు, లేజర్ గైడెడ్ మిస్సైళ్లు, ఆటోమెటిక్ ఎయిర్ వెహికిల్స్‌ను సమకూర్చి అండగా నిలిచింది. వాటి సహాయంతో శత్రువుల జాడలు పసిగట్టి కచ్చితమైన దాడులు చేయగలింది ఇండియన్ ఆర్మీ. దరిమిలా కార్గిల్ పోరులో మనం పైచేయి సాధించాం. కార్గిల్ వార్ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్-మనదేశం మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా రక్షణ సంబంధ విషయాల్లో ఇరు దేశాలు కలిసి పని చేశాయి. ఇప్పుడు మోదీ పర్యటనతో ఆ బంధం మరింత బలోపేతం కానుంది. అందుకే మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ హై-ప్రియారిటీ ఇస్తోంది.