సంస్కరణలు మరింత వేగవంతం
సంస్కరణలు మరింత వేగవంతం
Published Sun, Nov 22 2015 1:27 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ
కౌలాలంపూర్: పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించే దిశగా భారత్‌లో సంస్కరణలను మరింత వేగవంతంగా, సాహసోపేతంగా అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే పన్ను విధానాలు పారదర్శకంగా, నిలకడగా ఉండేలా చూడటంతో పాటు మేథోహక్కులను పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని మోదీ చెప్పారు. సమీప భవిష్యత్‌లో మరింత అధిక వృద్ధి రేటు సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఆసియాన్ వ్యాపార, పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న మోదీ.. గడిచిన 18 నెలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి, విదేశీ పెట్టుబడుల రాక మెరుగుపడ్డాయన్నారు. భారత్ ముఖచిత్రాన్ని మార్చడమే అంతిమ లక్ష్యమని, ఆ దిశగా చేసే సుదీర్ఘ ప్రయాణంలో సంస్కరణలు చిన్న చిన్న మజిలీలని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అధిక ద్రవ్యోల్బణం, నిల్చిపోయిన ప్రాజెక్టులు, భారీ ద్రవ్య లోటు తదితర సమస్యలతో ఎకానమీ అస్తవ్యస్తంగా ఉందని ఆయన చెప్పారు. ఆ తరుణంలో సంస్కరణల లక్ష్యం కేవలం జీడీపీ వృద్ధిని పెంచుకోవడం మాత్రమే కాకూడదని, దేశ ముఖచిత్రాన్ని మార్చేవిగా ఉండాలని నిర్దేశించుకున్నట్లు మోదీ తెలి పారు. దానికి అనుగుణంగానే ఏడాదిన్నర కాలంగా పలు సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు.
Advertisement