బృందావనంలో అశ్లీల చిత్రాల కలకలం
ప్రముఖ ఆథ్యాత్మిక పట్టణం, ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కాలేజీ విద్యార్థినుల అశ్లీల చిత్రాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 50 మందికి పైగా అమ్మాయిల ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో ఉంచారు. వారిని కాల్ గర్ల్స్ గా పేర్కొంటూ వాట్సాప్ ద్వారా మార్ఫ్డ్ ఫొటోలు, అమ్మాయిల పేర్లు, చిరునామా తదితర వివరాలు పొందుపర్చారు. దీంతో బాధిత యువతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, గత ఏడాది నవంబర్ లోనూ బృందావనంలో ఇదే తరహాలో పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఉదంతం సంచలనం రేపింది.
తాజా వ్యవహారంపై బాధితురాళ్లలో కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై నగర ఎస్సీ అలోక్ ప్రియదర్శిని స్పందిస్తూ ఈ ఉదంతాన్ని సైబర్ క్రైమ్ కేసుగా నమోదుచేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, గతంలో చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే బృందావనంలో మళ్లీ ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.