70 వేల మంది పిల్లలు.. డ్రగ్స్ బానిసలు!
దేశ రాజధాని నడివీధుల్లో తిరిగే దాదాపు 70 వేల మంది పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. తొమ్మిదేళ్ల వయసు నుంచి కూడా వాళ్లకు ఆ అలవాటు ఉంటోంది. ఈ విషయం తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్న ఇలాంటి వీధిబాలల ఆరోగ్యం, సంక్షేమాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవీ పెద్దగా వాళ్ల వద్దకు చేరడం లేదు. ఈ మొత్తం అంశాలపై ఢిల్లీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రభుత్వంతో కలిసి ఓ సర్వే చేసింది. వీధి బాలల గురించి ఇటీవలి కాలంలో చేసిన అతిపెద్ద సర్వే ఇదేనని ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మృణాళినీ దర్స్వాల్ చెప్పారు. ఏదో ఒక రూపంలో దాదాపు 70 వేల మంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉంటోందని, 20 వేల మంది పొగాకు వాడుతున్నారని తెలిపారు. 9500 మంది మద్యం తాగుతుండగా, మిగిలినవాళ్లు రకరకాల డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని చెప్పారు.
పొగాకు, డ్రగ్స్‌ను పీల్చుకునే అలవాటు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉంటోందని, 11 ఏళ్ల వయసులో మద్యం తాగడం మొదలుపెడుతున్నారని ఆమె వివరించారు. హెరాయిన్, ఒపియం లాంటి డ్రగ్స్ కూడా 12-13 ఏళ్ల నుంచి వాడేస్తున్నారు. తమ కుటుంబాల గురించి మర్చిపోడానికో, తాము కూడా పెద్దవాళ్లలా సిగరెట్లు కాల్చాలనో.. ఇలా ఏదో ఒక కారణంతో వీళ్లంతా డ్రగ్స్, పొగాకు వాడకాలు మొదలుపెడుతున్నారు. నిజానికి వీధిబాలలుగా తిరుగుతున్నవాళ్లలో 60 శాతానికి పైగా నిజానికి తమ కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. సుమారు 20 శాతం మంది పిల్లలు వీధుల్లో భిక్షమెత్తుకుని కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. వీళ్లు ఎక్కువగా షాపింగ్ మాల్స్, రైల్వే ప్లాట్ ఫారాలు, బస్టాండులు, డంపింగ్ యార్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, హోటళ్ల బయట కనిపిస్తుంటారు. ఈ పిల్లల్లో కేవలం 10.9 శాతం మంది మాత్రమే స్కూళ్లలో చదువుతున్నారు.
వీధి బాలలకు డ్రగ్స్ అలవాటు మార్పించేందుకు ప్రత్యేకంగా ఆరు ఆస్పత్రులలో డ్రగ్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకసారి పిల్లలకు డ్రగ్స్ వాడకం అలవాటు అయితే.. వాళ్లు మిగిలిన పిల్లలను కూడా ఆ మొగ్గులోకి దించుతారని, అందువల్ల ముందు వీళ్లతో ఆ అలవాటు మాన్పించడం అవసరమని అంటున్నారు.