పెషావర్ పాఠశాలలో తీవ్రవాదులు సాగించిన నరమేధం( ఫైల్ ఫోటో)
ఇస్లామాబాద్: పెషావర్ ఆర్మీ స్కూల్లో నరమేధానికి వ్యూహారచన చేసి ... అమలు చేసిన తీవ్రవాదుల్లో చాలా మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ ఉన్నతాధికారి అసిమ్ బాజ్వా గురువారం వెల్లడించారు. ఈ నరమేధంలో పాల్గొన్న 9 మంది తీవ్రవాదులు ఇప్పటికే సైన్యం చేతిలో చనిపోయారని తెలిపారు. అలాగే పాక్, ఆఫ్ఘానిస్థాన్లకు చెందిన 12 మంది తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సదరు తీవ్రవాదులను అప్పగించాలని ఇప్పటికే ఆఫ్ఘానిస్థాన్ను కోరినట్లు తెలిపారు.
ఈ దారుణ మారణ కాండకు వ్యూహారచన చేసిన తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్లను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని ఉన్నతాధికారి బాజ్వా ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 16న పాకిస్థాన్ పెషావర్లోని ఆర్మీ స్కూల్పై తీవ్రవాదులు విరుచుకు పడి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తీవ్రవాదుల ఘాతుకంలో మొత్తం 150 మంది మరణించారు. మృతుల్లో 140 మంది విద్యార్థులు ఉన్న సంగతి తెలిసిందే.
పెషావర్ స్కూల్పై దాడికి తీవ్రవాదులు పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహారచన చేసినట్లు పాక్ అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఘటనకు సూత్రధారులు తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్గా పాక్ దర్యాప్తులో తేలింది.