ఎక్కువ మంది సందర్శించే నగరాలివే
లండన్: ప్రపంచంలోని ఏ నగరాలను అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారన్న అంశంపై ‘యూరోమానిటర్’ సంస్థ ఆసక్తికరమైన సర్వే నివేదికను సమర్పించింది. సందర్శకుల ప్రాతిపదికన ఆయా నగరాలకు గ్లోబల్ ర్యాంకులను కేటాయించింది. ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే నగరంగా హాంకాంగ్ రికార్డు సష్టించగా, ఆ తర్వాతి స్థానాల్లో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్, లండన్, సింగపూర్, పారిస్, మకావు, దుబాయి, ఇస్తాంబుల్, న్యూయార్క్, కౌలాలంపూర్ నిలిచాయి.
2014 సంవత్సరంతో పోలిస్తే హాంకాంగ్‌ను సందర్శించిన వారి సంఖ్య 2015లో తగ్గినప్పటికీ తన మొదటి స్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంది. హాంకాంగ్‌తోపాటు పారిస్, మకావు నగరాలకు కూడా సందర్శకుల సంఖ్య తగ్గింది. బ్యాంకాక్‌ను సందర్శించే వారి సంఖ్య అనూహ్యంగా పది శాతం పెరగ్గా, లండన్‌ను సందర్శిస్తున్న వారి సంఖ్య ఏడు శాతం పెరిగింది. దక్షిణ కొరియాలోని సియోల్ పట్టణానికి సందర్శకుల సంఖ్య ఆరు శాతం తగ్గింది. జపాన్‌లోని టోక్యో నగరం ఆరు స్థానాలను అధిగమించి 17వ స్థానానికి చేరుకుంది. యూరప్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన పారిస్ నగరానికి సందర్శకుల సంఖ్య తగ్గడానికి అక్రమ వలసలను అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయి.