సందర్శకులకు స్వర్గధామం ఈ నగరాలు
లండన్ : మానసిక ఉల్లాసం, ప్రశాంతత కోసం సెలవు రోజుల్లో షికారు వెళ్లడం ఆధునిక జీవనశైలిలో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన ‘హాలిడే ట్రిప్’ సంస్కృతి నేడు మధ్య తరగతికి కూడా అలవాటైంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాలు ప్రత్యేక ప్యాకేజీలందిస్తూ వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. లండన్‌కు చెందిన యూరోమానిటర్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యయనం ప్రకారం 2017లో అత్యధిక మంది దర్శించిన టాప్ 100 సిటీల జాబితాలో వరుసగా తొమ్మిదోసారి హాంకాంగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బ్యాంకాక్, లండన్, సింగపూర్, మకావ్, దుబాయ్, పారిస్, న్యూయార్క్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఆసియా దేశాలదే హవా...
వీక్షకులను ఆకర్షించడంలో ఆసియా దేశాలు ముందున్నాయి. టాప్ 100 సిటీల జాబితాలో ఆసియా- ఫసిపిక్ ప్రాంతంలో గల 41సిటీలు చోటు దక్కించుకున్నాయి. 2010లో 34కే పరిమితమైన ఈ సంఖ్య, 2025 నాటికి 47కు చేరుకుంటుందని సంస్థ అంచనా వేసింది . ఈ రకమైన అనూహ్య పెరుగుదలకు కారణం చైనా సృష్టించుకున్న అతి పెద్దదైన టూరిజం మార్కెటేనని తన నివేదికలో పేర్కొంది.
మొదటి స్థానం హాంకాంగ్‌దే...
ఈ ఏడాది 26. 6 మిలియన్ల సందర్శకులతో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. వివాదాస్పద మెయిన్‌లాండ్ చైనా అంశం వల్ల ఈసారి 25. 5 మిలియన్లకే పరిమితమవుతుందనుకున్న హాంకాంగ్ అనూహ్య రీతిలో వరుసగా తొమ్మిదోసారి తన స్థానాన్ని పదిలపరచుకుంది. సంస్థ అంచనా ప్రకారం 2025 నాటికి సందర్శకుల సంఖ్య 45 మిలియన్లకు చేరుకోనుంది.
వెనుకబడిన యూరప్ సిటీలు...
యూరోజన్ సంక్షోభం, శరణార్థుల ఆగమనం, బ్రెగ్జిట్ అంశం, టెర్రరిస్ట్ దాడుల వల్ల యూరప్ సిటీలు ర్యాంకింగ్‌లో వెనుకబడినట్లు యూరోమానిటర్ ఇంటర్నేషనల్ తెలిపింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ లండన్, పారిస్‌లు వరుసగా 3, 7 స్థానాల్లో నిలిచి యూరప్ ప్రాతినిథ్యాన్ని ప్రతిబింబించాయి. బ్రెగ్జిట్ కారణంగా పౌండ్ విలువ తగ్గడం వల్లే ఎక్కువ మంది లండన్‌ని సందర్శించారని నివేదికలో పేర్కొంది.
ఇక అగ్రదేశం అమెరికా నుంచి న్యూయార్క్ సిటీ ఒక్కటే 12.7 మిలియన్ల సందర్శకులతో ఎనిమిదో స్థానంలో నిలిచింది