
ఇక అరుణ పేరిట అవార్డు
భోపాల్: 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, కన్నుమూసిన అరుణా షాన్ బాగ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గొప్ప నివాళి అర్పించింది. ఆమె పేరిట గొప్ప అవార్డును ప్రకటించింది. ఇక మహిళలపై దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఏ స్వచ్ఛంద సంస్థకై ప్రతి యేటా అరుణా షాన్ బాగ్ పేరిట రూ.లక్షతో అవార్డు ఇస్తామని చెప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుణకు ఘన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె జీవితంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని చెప్పారు.
గౌరవానికి అరుణ చిహ్నం అని అభివర్ణించారు. చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన తరుణం వచ్చిందని చెప్పారు. సమాజంలో మహిళలపట్ల ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమించిన డాక్టరు సందీప్ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి చివరకు ప్రాణాలు విడిచింది.