మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి వద్ద జరిగిన చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మూడురోజులుగా కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు తొమ్మిది కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. గురువారం నుంచి విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, ఇన్‌చార్జి డీఎంఏ అనితా రాజేంద్రన్, అదనపు సంచాలకులు రమేష్‌బాబుతో జరిగిన చర్చల్లో పలు అంశాలపై అంగీకారం కుదిరింది. వేతన సవరణ, కరువుభత్యం, సూపర్‌వైజర్ల వేతనాల అంశంపై మాత్రం ఈనెల 28న పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డితో జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అయితే చర్చలకు తమను ఆహ్వానించలేదని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గుర్తింపు పొందిన సంఘం మాత్రం సమ్మెను కొనసాగించాలని నిర్ణయించింది.
అధికారులతో జరిగిన చర్చల అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులు శంకర్(బీఎంఎస్), పాలడుగు భాస్కర్(సీఐటీయూ), కృష్ణారావు(ఏఐసీటీయూ) తదితరులు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సమ్మె ప్రారంభించిన తరువాత మూడు రోజులుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శితో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా ఆమోదం తెలుపుతూ లేఖ ఇచ్చారని తెలిపారు. సమ్మె కారణంగా గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీనికి వర్షాలు తోడవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న ఆందోళనతో కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపచేసే దిశగా అధికారులు వారి డిమాండ్లపై సానుకూలంగానే వ్యవహరించారు. సమ్మె కారణంగా పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తామని అధికారులకు కార్మిక సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వేల మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు తాజా నిర్ణయం వల్ల లబ్ధి చేకూర నుంది.
ప్రభుత్వం అంగీకరించిన కార్మికుల డిమాండ్లు ఇవే
హా జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా అన్ని కార్పొరేషన్లలోని కాంట్రాక్టు కార్మికులకు నాలుగు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం.
హా దుస్తులు మినహా పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న విధంగా మాస్క్‌లు, నూనె, పాదరక్షలు, చేతితొడుగులు ఇస్తారు.
హా కాంట్రాక్టు కార్మికులకు కూడా వారాంతపు సెలవు ఇస్తారు. దీనిని రొటేషన్ పద్ధతిలో వర్తింపచేస్తారు.
హా నాలుగు జాతీయ పండుగలతోపాటు మొత్తం ఎనిమిది రోజులు సెలవులు మంజూరు చేస్తారు.
హా పర్మినెంట్ కార్మికులకు 6, 12, 18, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తారు.
హా కాంట్రాక్టు కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు.
హా వీధి దీపాలు వేసేవారికి, నీటి సరఫరా సిబ్బంది, డ్రైవర్లు, పంప్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు అర్హతలకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు.
హా క్రమం తప్పకుండా వేతన సవరణ, పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న మాదిరి కరువుభత్యం, జీహెచ్‌ఎంసీలో కార్మికులకు సూపర్‌వైజరీ వేతనాల చెల్లింపు అంశాలు, వేతన సవరణ సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సీ వేతనాల అమలుపై ఈనెల 28వ తేదీన మంత్రి మహీధర్‌రెడ్డి సమక్షంలో చర్చించేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
హా పాఠశాలల్లో స్వీపర్లకు పూర్తికాలం వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
హా కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికులకు ఇళ్లస్థలాల విషయంలో ప్రాధాన్యం ఇస్తామని అంగీకరించారు.