24% పెరిగిన ముస్లిం జనాభా!
2011 జనాభా లెక్కల ఆధారంగా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ముస్లిం జనాభాలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా పెరుగుదల నమోదైంది. 2011 జనగణనలో సేకరించిన వివరాల్లో మత ప్రాతిపదికన పరిశీలిస్తే... 2001-2011 మధ్య కాలంలో దేశంలో ముస్లిం జనాభా 24 శాతం పెరగగా.. మొత్తం దేశవ్యాప్తంగా సగటు పెరుగుదల 18 శాతంగా నమోదైంది. 2001లో దేశంలోని మొత్తం జనాభాలో ముస్లింల సంఖ్య 13.4 శాతంగా ఉండగా.. 2011 నాటికి 14.2 శాతానికి పెరిగింది.
రాష్ట్రాల వారీగా చూస్తే జమ్మూకశ్మీర్ 68.3 శాతం ముస్లిం జనాభాతో అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో అస్సాం (34.2 శాతం), పశ్చిమబెంగాల్ (27 శాతం), కేరళ (26.6 శాతం), ఉత్తరప్రదేశ్ (19.3 శాతం), ఉత్తరాఖండ్ (13.9 శాతం), ఢిల్లీ (12.9శాతం) రాష్ట్రాలు నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9.6 శాతంగా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ముస్లిం జనాభా 96.2 శాతంగా వెల్లడైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 2001లో ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 30.9 శాతం ముస్లింలు ఉండగా... పదేళ్లలో 34.2 శాతానికి చేరడం గమనార్హం. గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరిగిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు.
కాగా కేవలం ఒక మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే ముస్లింల జనాభా 8.8 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గింది. అయితే.. దేశంలో ముస్లింల జనాభా 1991-2001 మధ్య 29 శాతం పెరిగింది. ప్రస్తుతం నమోదైన 24 శాతాన్ని బట్టి వారి జనాభా పెరుగుదల వేగం కొంత వరకు తగ్గింది. కాగా ఈ జనాభా లెక్కలను గణాంకాల విభాగం రిజిస్ట్రార్ జనరల్ సరిచూసి, ధ్రువీకరించాల్సి ఉందని కేంద్ర హోంశాఖ ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. అనంతరం త్వరలోనే ఈ నివేదికను విడుదల చేసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మతాల వారీగా గణాంకాలను గత ఏడాది మార్చిలోనే విడుదల చేయాల్సి ఉన్నా... అప్పటి యూపీఏ ప్రభుత్వం నిలిపివేసింది.