నాన్న బాగున్నారు..
ఏఎన్నార్ ఆరోగ్యంపై నాగార్జున వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘నాన్నగారి ఆశావహ దృక్పథమే ఆయన్ను కోలుకునేలా చేస్తోంది. ఆరోగ్యపరమైన సవాళ్లను ఆయన సమర్థవంతంగా అధిగమించగలుగుతున్నారు. ఈనెల ఒకటో తేదీన కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబమంతా కలిసి జరుపుకున్నాం. నాన్నగారు చాలా ఎంజాయ్ చేశారు’’ అని నటుడు అక్కినేని నాగార్జున వెల్లడించారు. అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తన ఆరోగ్య పరిస్థితి గురించి నాన్నగారు ఆ మధ్యే మీడియాకు వెల్లడించారు. ఆరోజు చెప్పిన విషయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే చాలా పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. అదే ఆయన బలం. టీవీలో తన అభిమాన కామెడీ షోస్ చూస్తూ, నచ్చిన పాటలు వింటూ కాలక్షేపం చేస్తున్నారు.
పాత సినిమాల నుంచి ఈ మధ్య విడుదలైన ’ఉయ్యాలా జంపాలా’ వరకు చూడని సినిమాలు చూస్తున్నారు. రోజూ వార్తాపత్రికలు చదువుతున్నారు. ఆయన పట్ల అభిమానులు కనబరుస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఈ ప్రేమానురాగాలే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. తనకు కేన్సర్ కణాలు సోకాయని, అయినా భయపడాల్సిన అవసరం లేదని ఇటీవల అక్కినేని వెల్లడించిన సంగతి తెలిసిందే. తన తల్లి 96 ఏళ్లు బతికారని, 100 ఏళ్లు కాకపోయినా తన తల్లిలా 96 ఏళ్లయినా బతుకుతాననే నమ్మకం ఉందని అప్పుడు పేర్కొన్నారు.