కట్నం ఇవ్వలేదని.. గ్యాంగ్ రేప్ చేసి..
Published Tue, Jun 28 2016 9:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
జైపూర్: కట్నం ఇవ్వలేదని భార్యను కుటుంబసభ్యులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి, ఆమె ఒంటి నిండా టాటూలు వేయించిన ఘటన రాజస్థాన్ లోని అల్వార్ కు దగ్గరలోని రైనీ గ్రామంలో వెలుగుచూసింది. గత ఏడాది జనవరిలో వివాహం చేసుకున్న బాధితురాలు(30)ను ఆమె భర్త జూన్ నెల నుంచి కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి తండ్రి పెళ్లిలో రూ. 51,000 కట్నం ఇవ్వలేదనే కోపంతో ఆమెతో రోజూ క్రూరంగా ప్రవర్తించేవాడు.
అంతేకాకుండా, తన ఇద్దరు సోదరులు, చుట్టాలతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. చెప్పలేని మాటలను ఆమె ఒంటి నిండా టాటూలు వేయించాడు. దీంతో గత నవంబర్ నెలలో వారి నుంచి తప్పించుకున్న మహిళ తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. ఈ విషయాన్ని గత ఆదివారం పోలీసులకు తెలిపిన బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె భర్త, అతని కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకోవడాని రైనీ గ్రామానికి వెళ్లిన పోలీసులకు వారి ఆచూకీ లేకపోవడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి నుదిటిపై 'నా తండ్రి దొంగ' అనే టాటూ వేయించారని పోలీసులు తెలిపారు. ఘటనను తెలుసుకుని షాక్ కు గురైన కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంలో జాతీయ మహిళ కమిషన్ జోక్యం చేసుకుని కేసును విచారించాలని ఆదేశించారు.
Advertisement
Advertisement