
సెప్టెంబర్ 2 నుంచి హరికృష్ణ యాత్ర?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ రెండో తేదీ నుంచి చైతన్య రధయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అదే రోజు హరికృష్ణ పుట్టిన రోజు కూడా. ఆయన మొదట తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు నెక్లెస్ రోడ్డులోని ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలోని నిమ్మకూరు చేరుకుంటారు.
అక్కడ తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తారని సన్నిహితవర్గాలు తెలిపాయి. సమైక్యాంధ్ర కోసం గ్రామాల్లో జరిగే ఆందోళనల్లో పాల్గొంటూ ఆయన ముందుకు సాగుతారని తెలుస్తోంది. సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా హరికృష్ణ నిర్విహ ంచే ఈ చైతన్య రథయాత్రకు సహకరించాలని, అందులో భాగస్వామ్యం కావాలని ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలనే ఏకైక నినాదంతో ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆ మౌలిక సూత్రానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనే ఆంశంపై వారు మథనపడుతున్నారు.
దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ అభిమానులందరూ ఒకచోట సమావేశమైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కట్టడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో వారు ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్లద్వారా సంప్రదించుకుంటూ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆశయాన్ని ఎవరు సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో వారికి అండగా నిలిస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హరికృష్ణ యాత్రలో తాము పూర్తిగా భాగస్వామ్యం అవుతామని ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడు ఒకరు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో కీలకపాత్ర పోషించే ఒక నాయకుడు ఈ విషయంలో వీరందరినీ సమన్వయ పరిచారని సమాచారం.
బాబు బుజ్జగింపుల పర్వం
తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకున్న తరుణంలో.. అందుకు పూర్తి విరుద్ధంగా పొలిట్‌బ్యూరోసభ్యుడైన హరికృష్ణ తన ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో పాటు సమైక్య యాత్రను చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, దీనివల్ల పార్టీ మరింత నష్టపోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నట్లు సమాచారం. అందుకే మధ్యవర్తుల ద్వారా హరికృష్ణను బుజ్జగించడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా... తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై హరికృష్ణ ఘాటుగా స్పందించారు. తన విషయంలో కుక్కలు మొరుగుతున్నాయని, ఆ మొరుగుళ్లకు తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు.