అందరినీ సంతృప్తి పరచలేం
నామినేటెడ్ పదవులపై తేల్చి చెప్పిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: పార్టీలోని నేతలందరినీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు నేతలు తమ స్థాయికి మించిన పదవులు ఇవ్వాలని కోరుతున్నారని, అలాంటపుడు వారిని సంతృప్తి పరచటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ పార్టీ అధ్యక్షులు కె. కళా వెంకట్రావు, ఎల్. రమణ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
సమావేశ వివరాలను కాలువ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. వారు చెప్పిన వివరాలతో పాటు నేతల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలిచేలా ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పశ్చిమ రాయలసీమ నుంచి కేజే రెడ్డి పోటీచేస్తారని లోకేశ్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో ఇచ్చేయాలని నిర్ణయించారు. అయితే ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా హైదరాబాద్‌లో ఏపీ భవన్‌కోసం ఒక దాన్ని కే టాయించాలని కోరాలని నిర్ణయించారు. ఈ అంశంతో పాటు తొమ్మిది, పదో షెడ్యూల్స్‌లోని సంస్థల విభజన, నిధుల పంపిణీ తదితర అంశాలపై గవర్నర్, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారు.