సీతయ్యకు మళ్లీ హ్యాండ్...
సీతయ్యకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అయిదో జాబితాలో కూడా నందమూరి హరికృష్ణకు చోటు దక్కలేదు. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై హరికృష్ణ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈసారి హిందూపురం కాకుంటే కృష్ణాజిల్లాలో టికెట్ కేటాయిస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సీతయ్య తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు.
హిందుపురం లేదా కృష్ణాజిల్లాలో ఏదో స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తారని ఆశించినట్లు హరికృష్ణే స్వయంగా చెప్పారు. తాను చంద్రబాబును టికెట్ అడగలేదనటం అవాస్తమని ఆయన రెండు రోజుల క్రితమే వెల్లడించారు కూడా. ఇక తండ్రి స్థాపించిన పార్టీలో తనయుడికి టికెట్ కేటాయించకపోవటంపై నందమూరి అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణాజిల్లా నుంచి హరికృష్ణకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు నైజం మరోమారు బయటపడింది. కాంగ్రెస్ నుంచి వచ్చి చేరి పిల్లను, పదవిని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చివరకు ఎన్టీఆర్ వారసులను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. టీడీపీలో తన పెత్తనానికి తిరుగులేకుండా చేసుకునేందుకు బాలకృష్ణను అడ్డుపెట్టి హరికృష్ణ దూకుడుకు బ్రేక్ వేసేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారని నందమూరి మండిపడుతున్నారు.
హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లే స్వయంగా చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు బాబు అడ్డుచక్రం వేశారు. మరోవైపు టికెట్ దక్కకపోవటంతో హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా తన సోదరుడు బాలకృష్ణపైన ఆయన హిందుపురం నుంచి పోటీ చేయవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.