సాక్షి, అమరావతి: రాజధానిపై నిధుల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు వినియోగ పత్రాలు (యూసీ) అడిగే అర్హత ఎక్కడిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడ కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మహానాడు రెండో రోజైన సోమవారం పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయంటూ అమిత్‌షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రణాళికలు ఎప్పుడో వచ్చాయని, రూ. 24 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో కొన్ని పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు.
రాజధానిపై తామిచ్చిన యూసీలు సరిగానే ఉన్నాయని నీతిఆయోగ్ చెప్పిందని, అయినా కూడా అమిత్‌షా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా ఇలా ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలనా వ్యవహారాల్లో బీజేపీ అధ్యక్షుడు తలదూర్చడం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను వాడుకుంటూ తమపై దాడి చేస్తున్నారని అన్నారు. 22 కోట్ల మంది సెల్ నంబర్లు తన వద్ద ఉన్నాయంటున్న అమిత్‌షా వాటిని పాలనకు వినియోగించుకోవాలని, బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలకు కాదన్నారు.
తెలుగువారు గర్వపడేలా ఎన్టీఆర్ బయోపిక్
తెలుగువారంతా గర్వపడలా, స్ఫూర్తి పొందేలా ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించి, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినప్పుడే ఆయనకు అసలైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై గతంలో తీర్మానం చేశామని, మళ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. రాజధానిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. సినిమాల ద్వారా విభిన్న పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని కొనియాడారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించారని, సంక్షేమ పథకాల ఘనత ఆయనదేనని, పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు.
ఇకపై పార్టీకి ఎక్కువ సమయం
నాలుగేళ్లుగా పార్టీకి పెద్దగా సమయం ఇవ్వలేకపోయాయని, ఇకపై ఎక్కువ సమయం కార్యకర్తలకే కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తన జీవిత ఆశయమని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో 54 ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భావితరాలకు గుర్తుండేలా బయోపిక్: బాలకృష్ణ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రానికి నమ్మకం ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం మహానాడులో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు గుర్తుండేలా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నామని తెలిపారు. బయోపిక్‌లలో తండ్రి పాత్రను ఏ కొడుకూ ఇంతవరకు చేయలేదని.. అలా చేసే అదృష్టం తనకే దక్కిందన్నారు.
బీజేపీ ఏమీ చేయలేక కొత్త నటులను, కులసంఘాలను రంగంలోకి దించుతోందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. మహానాడులో ఆయన ప్రసంగిస్తూ.. పద్ధతి ప్రకారం పాలన చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 68 ఏళ్ల వయసులో రాష్ట్రం కోసం నిత్యం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వం వేసిన సీసీ రోడ్ల మీదే ప్రతిపక్షాలు నడుస్తున్నాయని చెప్పారు.
యూసీలు అడిగే అర్హత అమిత్‌షాకు లేదు: సీఎం
Published Tue, May 29 2018 2:03 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment