బాబు ధనదాహం..పార్టీకి శాపం!
- బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టారంటూ తెలుగు తమ్ముళ్ల విమర్శలు
- మూడు లోక్‌సభ సీట్లపైనా ప్రభావం పడుతుందని ఆవేదన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధనదాహం పార్టీని భారీగా దెబ్బతీసే పరిస్థితి కనబడుతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. కోట్లు కుమ్మరించిన బలహీన అభ్యర్థులకే ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పార్టీ ఎంపీ అభ్యర్థులకు శాపంగా మారుతోందని పేర్కొంటున్నారు. పార్టీలోని బలహీన అభ్యర్థుల గురించి పట్టించుకోకుండా బీజేపీని విమర్శించడంపై పెదవి విరుస్తున్నారు.
సాక్షి, విజయవాడ : జిల్లా పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ముగ్గురు బలహీన అభ్యర్థులు పోటీలో ఉన్నారని టీడీపీ కేడర్ అభిప్రాయపడుతోంది. వారివల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులకు భారీగా ఓట్లు తగ్గిపోతాయని పేర్కొంటోంది. పార్టీ అధినేత చంద్రబాబు ధన దాహం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలతో పాటు సొంత పార్టీలోనే దీర్ఘకాలంగా పనిచేసిన నేతలకు సైతం చంద్రబాబు సీట్లు అమ్మడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రూ.5 కోట్లు పలికిన పెనమలూరు సీటు
పెనమలూరు సీటుకు మొదటి నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. సినీ నటుడు హరికృష్ణతో పాటు స్థానికంగా పలువురు నేతలు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. చివరకు జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మధ్యవ ర్తిత్వం చేయడంతో రూ.5 కోట్లకు బోడె ప్రసాద్‌కు ఈ సీటు కేటాయించారని ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. బోడే ప్రసాద్‌కు సీటు కేటాయించడంపై నియోజకవర్గంలోని పార్టీ నేతలు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడే తప్ప ఎమ్మెల్యేగా ఎంతమేరకు పోటీ ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రసాద్‌కు సీటు ఇవ్వడంపై నియోజకవర్గంలోని మిగిలిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీని ప్రభావం మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ఎన్నికపై కూడా పడుతుందని పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథికి ఇది సొంత నియోజకవర్గం కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమని టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.
విజయవాడ (తూర్పు) కొంప ముంచేనా!
విజయవాడ (తూర్పు) సీటు గురించి చివరి వరకు బేరసారాలు జరిగినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవిని రూ.3 కోట్లు పార్టీ అడగ్గా, తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు కోటి రూపాయలు ఇచ్చినా సీటిస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దానికి కూడా ఆయన సుముఖంగా లేకపోవడంతో చివరకు రూ.1.50 కోట్లకు గద్దె రామ్మోహన్‌కు ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రసాదంపాడుకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త నుంచి గద్దె నిధులు అప్పుగా తెచ్చి పార్టీకి చెల్లించారనేది పార్టీ వర్గాల సమాచారం. గద్దెకు సీటు ఇవ్వడంతో యలమంచిలి రవితో పాటు ఎంవీఆర్ చౌదరి వర్గీయులు భగ్గుమంటున్నారు. దీనికి తోడు ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, కేశినేని నానితో విభేదాలు అటు గద్దెకు.. ఇటు ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి శాపంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్నారు.
చివరి వరకు నాన్చి.. స్థానికేతరుడికిచ్చి..
నూజివీడు సీటును చంద్రబాబు చివరి వరకు నాన్చి, కాంగ్రెస్ నుంచి వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. అవనిగడ్డ, నూజివీడులలో ఏదోక సీటు దక్కుతుందనే నమ్మకంతో పార్టీకి సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేశానని ముత్తంశెట్టి కృష్ణారావు చెబుతున్నారు. ఇప్పుడు తనకు సీటు కేటాయించకపోవడంతో ఆయన ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానికులకే సీటు కేటాయించాలనే నియోజకవర్గ నేతల డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోకుండా సీటు అమ్ముకోవడంపై నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. దీని ప్రభావం ముద్దరబోయినతో పాటు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు పైనా ఉంటుందని అంటున్నారు.