
'ప్రధాని పదవి కోసం గుజరాత్ ప్రజల సంక్షేమాన్ని మరిచారు'
గుజరాత్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గాలికి వదిలేశారని బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్ బబ్బర్ ఆరోపించారు. దేశ ప్రధాని పీఠంపై అధిష్టించాలన్న తోందరలో మోడీ గుజరాత్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్కోట్లో శనివారం మైనారిటీ కమ్యూనిటీ నిర్వహించిన 14వ జాతీయ వర్క్ షాపులో రాజ బబ్బర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను మోడీ పక్క తొవ పట్టిస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్జున్ మెద్వాడియా పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొంత మంది పారిశ్రామికవేత్తలకు మోడీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 2014 లోక్ సభ ఎన్నికల గడువు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తు ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజబబ్బర్ గుజరాత్ రాష్ట్ర పరిపాలన, ప్రజల సంక్షేమాన్ని వదిలి మోడీ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు సంధించారు.