సోనియా కుటుంబం అవినీతిపై మోదీ సెటైర్లు
దేశంలో అవినీతి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే సోనియా గాంధీ కుటుంబంపై గట్టిగా సెటైర్లు వేశారు. మన దేశంలో రాజకీయ నాయకుల మీద వాళ్లు పదవిలోకి వచ్చిన కొద్దికాలానికే ఆరోపణలు వస్తాయని చెప్పారు. ఆయన 50 కోట్లు, ఈయన 100 కోట్లు తీసుకున్నాడని అంటారన్నారు. కొడుకు 150 కోట్లు, కూతురు 500 కోట్లు, అల్లుడు వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని చెబుతారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టారు.
''సవతి తమ్ముడు కాంట్రాక్టులు, ఇంకొకళ్లు ఇంకోటి తీసుకున్నారని విని విని మీ చెవులు దిబ్బళ్లు పడిపోయాయా, అవినీతి మీద మీకు చికాకు పుట్టిందా లేదా.. నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నా మీద ఏమైనా ఆరోపణలున్నాయా?'' అంటూ ఎన్నారైలను ప్రశ్నించారు. దానికి లేవు.. లేవు అంటూ అక్కడున్న ప్రజల నుంచి సమాధానం వచ్చింది. 'నాకు మీ నుంచి సర్టిఫికెట్ కావాలి' అని అడిగి, జీవించినా దేశం కోసమే.. మరణించినా దేశం కోసమేనంటూ సభను ఉర్రూతలూగించారు.