న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ తెరదించారు. కొద్దికాలంగా అందరూ ఊహిస్తున్నట్లే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సిద్దూకు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సిద్దూ చేరికతో పంజాబ్‌లో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.
వాస్తవానికి జనవరి 9నే సిద్దూ కాంగ్రెస్‌లో చేరాల్సిఉంది. అయితే రాహుల్ గాంధీ విదేశాల నుంచి రావడం ఆలస్యంకావడంతో చేరిక వాయిదా పడింది. రాహుల్ సమక్షంలో మాత్రమే పార్టీలో చేరాలని భావించిన సిద్దూ ఆ మేరకు ఆదివారం లాంఛనాన్ని పూర్తిచేశారు. సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ గత నవంబర్‌లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. 2016 ఏప్రిల్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్దూ ‘ఆవాజ్ ఎ పంజాబ్’ కూటమిని ఏర్పాటుశారు. చివరికి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో అమృత్‌సర్ ఈస్ట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారని తెలిసింది. 117 మంది ఎమ్మెల్యేలుండే పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి.