ప్రధాని కూతురు ట్వీట్లతో దుమారం!
లాహార్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ మాటల యుద్ధంతో ట్విట్టర్‌లో దుమారం రేపారు. తన తండ్రి షరీఫ్ విదేశాల్లో అక్రమ సంపద కూడబెట్టారన్న పనామా పత్రాలను ఆమె తీవ్రంగా తిరస్కరించారు. ఈ పత్రాలను పరిశీలించిన జర్మన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌పైనా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. పనామా పత్రాల ఆధారంగా తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్న ప్రత్యర్థులను ఆమె చీల్చిచెండాడారు.
'పనామా పత్రాలు ఉత్త చెత్త. వాటిని చెత్తకుప్పలో వేయాలి. వాటిని ఉపయోగించుకొని నవాజ్ షరీఫ్‌ను దెబ్బతీయాలనుకున్నవాళ్లు మట్టికరిచిపోతారు' అని ఆమె ధ్వజమెత్తారు. 'పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవి కావు. దొంగలు, హ్యాకర్లు (వీటిని వెలుగులోకి తెచ్చినవారు) సైతం ఈ విషయాన్ని చెప్పలేదు. పరాజితులకు ప్రమాదం తప్పదు' అని మరియమ్ పేర్కొన్నారు.
దీనిపై జర్మన్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టు బాస్టియన్ ఒబెర్మేయర్ స్పందిస్తూ 'మీకు ఈ విషయం చెప్తున్నందుకు సారీ: పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవే. ఆశ్చర్యకరమైనరీతిలో అవినీతి కేసులను ఈ పత్రాల ద్వారా మేం కనుగొన్నాం. అన్ని నిజమైనవే' అని బదులిచ్చారు. దీనిని మరియమ్ తప్పుబట్టారు. షరీఫ్ మెడకు చుట్టుకున్న పనామా పత్రాల కేసులో ఉమ్మడి దర్యాప్తు బృందం (జేఐటీ) చేపడుతున్న విచారణను పర్యవేక్షించేందుకు పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన నేపథ్యంలో మరియమ్ ఈ విమర్శలు చేయడం గమనార్హం.