Panamagate
-
రూ.కోట్లల్లో ప్రధాని కుమార్తె ఆస్తులు
-
రూ.కోట్లల్లో ప్రధాని కూమార్తె ఆస్తులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మార్యాం నవాజ్‌పై పనామా కుంభకోణం సంయుక్త విచారణ కమిటీ (జేఐటీ) సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమకు నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తున్నారని, ఇది ముమ్మాటికీ క్రిమినల్ నేరం అవుతందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా గేట్ కుంభకోణంలో షరీఫ్ కుటుంబానికి పెద్ద మొత్తంలో చోటుందని, దానికి సంబంధించిన విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్‌లోని జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. అయితే, షరీఫ్ కూతురు మార్యాం నవాజ్, ఆమె సోదరులు హుస్సేన్, హసన్ నవాజ్, అలాగే ఆమె భర్త కెప్టెన్ మహ్మద్ సఫ్దార్ కూడా తప్పుడు ధ్రువపత్రాలపై సంతకాలు పెట్టి వాటినే సమర్పిస్తూ సుప్రీంకోర్టును పక్కదారి పట్టిస్తున్నారంటూ జేఐటీ ఆరోపించింది. 'మార్యామ్ నవాజ్‌కు 2009 నుంచి 2016 మధ్య కాలంలో రూ.73.5మిలియన్ల నుంచి రూ.830.73 మిలియన్ల వరకు ముట్టాయి' అని కూడా జేఐటీ తెలిపింది. ఎలాంటి ఆదాయం లెక్కలు చూపించకుండానే 1990 నుంచి ఈ మధ్య కాలంలో అనూహ్యంగా ఆమె ఆస్తులు వందల రెట్లు పెరిగాయని కూడా పేర్కొంది. అయితే, దీనిపై షరీఫ్ కూతురు స్పందించారు. అసలు విషయం సుప్రీంకోర్టులో తేలుతుందని, అంతకుముందు వచ్చే ఏ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
ప్రధాని కూతురు ట్వీట్లతో దుమారం!
లాహార్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ మాటల యుద్ధంతో ట్విట్టర్లో దుమారం రేపారు. తన తండ్రి షరీఫ్ విదేశాల్లో అక్రమ సంపద కూడబెట్టారన్న పనామా పత్రాలను ఆమె తీవ్రంగా తిరస్కరించారు. ఈ పత్రాలను పరిశీలించిన జర్మన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌పైనా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. పనామా పత్రాల ఆధారంగా తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్న ప్రత్యర్థులను ఆమె చీల్చిచెండాడారు. 'పనామా పత్రాలు ఉత్త చెత్త. వాటిని చెత్తకుప్పలో వేయాలి. వాటిని ఉపయోగించుకొని నవాజ్ షరీఫ్‌ను దెబ్బతీయాలనుకున్నవాళ్లు మట్టికరిచిపోతారు' అని ఆమె ధ్వజమెత్తారు. 'పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవి కావు. దొంగలు, హ్యాకర్లు (వీటిని వెలుగులోకి తెచ్చినవారు) సైతం ఈ విషయాన్ని చెప్పలేదు. పరాజితులకు ప్రమాదం తప్పదు' అని మరియమ్ పేర్కొన్నారు. దీనిపై జర్మన్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టు బాస్టియన్ ఒబెర్మేయర్ స్పందిస్తూ 'మీకు ఈ విషయం చెప్తున్నందుకు సారీ: పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవే. ఆశ్చర్యకరమైనరీతిలో అవినీతి కేసులను ఈ పత్రాల ద్వారా మేం కనుగొన్నాం. అన్ని నిజమైనవే' అని బదులిచ్చారు. దీనిని మరియమ్ తప్పుబట్టారు. షరీఫ్ మెడకు చుట్టుకున్న పనామా పత్రాల కేసులో ఉమ్మడి దర్యాప్తు బృందం (జేఐటీ) చేపడుతున్న విచారణను పర్యవేక్షించేందుకు పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన నేపథ్యంలో మరియమ్ ఈ విమర్శలు చేయడం గమనార్హం. -
ప్రధాని రూ. 1000 కోట్లు ఆఫర్ చేశారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, తెహ్రెక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పనామా పత్రాల లీక్ వ్యవహారంపై మాట్లాడకుండా ఉంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తానని షరీఫ్ ఆఫర్ చేశారని ఇమ్రాన్ బాంబు పేల్చారు. అయితే ప్రధాని నేరుగా ఈ ప్రతిపాదన తీసుకురాలేదని, పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ స్నేహితుడు ఒకరు ఈ ఆఫర్ చేసినట్టు తెలిపారు. రెండు వారాల క్రితం ఆ వ్యక్తి తనను కలసి ఈ విషయంపై మాట్లాడినట్టు ఇమ్రాన్ చెప్పారు. పనామా గేట్ విషయంలో మౌనంగా ఉండాలని ప్రధాని షరీఫ్ కోరినట్టు ఆయన తనకు చెప్పారని వెల్లడించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్ ఆరంభం మాత్రమేనని, షరీఫ్ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తే మరింత మొత్తం ఇస్తారని చెప్పినట్టు ఇమ్రాన్ తెలిపారు. కాగా ఈ ఆరోపణలను పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. ఇమ్రాన్ అబద్ధాలకోరనే రికార్డు ఉందని విమర్శించారు. తాను ఈ విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని హెచ్చరించారు. మనీలాండరింగ్ ద్వారా ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులు విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ సాగుతోంది.