రాహుల్ కలల ప్రాజెక్టు రద్దు
లక్నో: సొంత లోక్‌సభ నియోజకవర్గం అమేథీని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా మలచాలనే రాహుల్ గాంధీ కలలు కల్లలయ్యాయి. అమేథీలోని జగదీశ్‌పూర్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు సహకారంతో మెగా ఫుడ్ పార్కుకు రాహుల్ 2013లో శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఫుడ్ పార్కును కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రద్దు చేసింది. ఈ ఫుడ్ పార్కును దక్కించుకున్న శక్తిమాన్ ఫుడ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (బిర్లా గ్రూపునకు అనుబంధ సంస్థ) అనే సంస్థ ఆరునెలల్లోగా భూసేకరణను పూర్తిచేయలేకపోయిందని, అలాగే పలు ఇతర అంశాల్లో కూడా ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడలేదని... అందువల్లే ఫుడ్‌పార్కును రద్దు చేశామని ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇందులో ఏర్పాటు చేసే క్యాప్టివ్ పవర్ ప్లాంటుకు సబ్సిడీపై గ్యాస్‌ను సరఫరా చేయకపోతే... ప్రాజెక్టు ఆర్థికంగా మనజాలదని కూడా శక్తిమాన్ సంస్థ తెలిపిందని... అయితే సబ్సిడీపై గ్యాస్ సరఫరా చేయాలనే నిబంధన ఫుడ్‌పార్క్ పాలసీలోనే లేదని ఆయన అన్నారు. రాహుల్ సన్నిహితులు మాత్రం రద్దు నిర్ణయంపై మండిపడుతున్నారు. 40 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, దీనిని రద్దు చేయడం బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు మరో ఉదాహరణ అని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రతాప్‌సింగ్ అన్నారు.
సంక్షిప్తంగా..
‘రాహుల్ వేచిచూడాలి’: సోనియా గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని, పార్టీ పగ్గాలు అందుకోవాలంటే రాహుల్ తొలుత తగిన అనుభవం గడించాలని పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ అన్నారు. యువతకు పగ్గాలు ఇవ్వడమనేది బలవంతంగా జరగరాదన్నారు. రాహుల్ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో మమేకం కావాలన్నారు.
‘రఫల్’పై కోర్టుకెళతా.. స్వామి: ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ నుంచి 36 రఫల్ విమానాలను కొనుగోలు చేయాలనే ఒప్పందం అవినీతిమయమని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి అన్నారు. కేంద్రం తన సూచనను పట్టించుకోకపోతే కోర్టుకెళతానన్నారు.
‘రహస్య కెమెరా’.. ఉద్యోగి పనే: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ దృశ్యాల చిత్రీకరణ ఓ ఉద్యోగి పనేనని పోలీసులు తేల్చారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్‌లో ఇరానీ.. సీసీ టీవీ కెమెరా ట్రయల్ రూము వైపున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి అభ్యంతరం చేసిన వెంటనే ఓ ఉద్యోగి కెమెరాను మరోవైపు తిప్పాడని, అతని వద్దే డిజిటల్ వీడియో రికార్డర్ పాస్‌వర్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని పేరును వెల్లడించలేదు.
అలీగఢ్ వర్సిటీ వీసీగా సైఫుద్దీన్: భారత్‌లోని బోహ్రా ముస్లిం నేత సైదానా ముఫదాల్ సైఫుద్దీన్ అలీగఢ్ ముస్లిం వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఎంపికయ్యారు. వర్సిటీ పాలకవర్గ సమావేశంలోఎన్నిక నిర్వహించగా సైఫుద్దీన్ 97- 33 ఓట్ల తేడాతో రిటైర్డ్ ఐఏఎస్ మెహ్మదూర్ రహమాన్‌పై నెగ్గారు.
బంగ్లా జమాతే ఇస్లామీ అగ్రనేత ఉరితీత: బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ కాలంలో యుద్ధనేరాలకు పాల్పడి వేలాదిమంది మృతికి కారకుడైన జమాతే ఇస్లామీ అగ్రనేత ముహమ్మద్ కమారుజ్జమాన్(63)ను శనివారం రాత్రి ఉరితీశారు. మరణశిక్షను పునస్సమీక్షించాలన్న ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. దీంతో దేశాధ్యక్షుడిని క్షమాభిక్ష కోరొద్దని కమారుజ్జమాన్ నిర్ణయించుకున్నాడని స్థానిక మీడియా తెలిపింది.