ఎమ్మారై కావాలా.. 2018లో రండి!
దేశ రాజధానిలోని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న మొత్తం 34 ప్రభుత్వాస్పత్రులలో 11 వేల బెడ్లు ఉండగా, వచ్చే పేషెంట్ల సంఖ్య మాత్రం 50 వేలకు పైగా ఉంది. ఏదైనా పెద్ద దెబ్బ తగిలి గానీ, తీవ్ర అనారోగ్యంతో ఉండి గానీ ఎమ్మారై తీయించుకోవాలంటే.. 2018 వరకు ఆగాలి. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లోల అయితే ఎమ్మారై పరీక్షకు దాదాపు రూ. 5 వేల వరకు ఖర్చవుతుంది. అదే ప్రభుత్వాస్పత్రులలో అయితే ఉచితంగా చేస్తారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించడంతో వీటికోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిపోయి, వేచి ఉండాల్సిన సమయం మరో ఏడాది పెరిగిందని ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. ఆస్పత్రులలో సదుపాయాలు, ఉద్యోగుల సంఖ్యను ఏమాత్రం పెంచకుండా ఇలా ఉచితంగా చేస్తామనడం వల్లే ఇలా జరగిందంటున్నారు. ఉచితానికి ముందు సబ్సిడీ చార్జీలతో ఎమ్మారై తీయించుకోవాలంటే రూ. 1200 నుంచి రూ. 3వేల వరకు అయ్యేది. కొత్తగా ఐదు ఎమ్మారై మిషన్లు, 10 సిటి స్కాన్ మిషన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త ఎమ్మారై యంత్రాలు తీసుకుంటామని ఢిల్లీ ఆరోగ్యశాఖ కార్యదర్శి తరుణ్ సీమ్ చెప్పారు.
ఒక మహిళకు గత నెలలో ఉన్నట్టుండి కణితి వచ్చింది. ఆమెకు 8 గంటల్లోగా ఆపరేషన్ చేయించాలని అన్నారు. ఆమెకు వెంటనే ఎమ్మారై చేయించాల్సి ఉండగా.. 15 రోజుల తర్వాత గానీ చేయలేమని చెప్పారు. దాంతో ఆ కుటుంబం స్థోమత లేకపోయినా ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రంలోనే ఎమ్మారై చేయించుకుంది. లోక్ నాయక్, జీబీ పంత్.. ఇలాంటి ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. లోక్ నాయక్ ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మారై మిషన్ల ఖరీదు రూ. 4 కోట్ల నుంచి రూ. 14 కోట్ల వరకు ఉన్నాయి. అయినా, ఢిల్లీ ప్రభుత్వం గత సంవత్సరం లోక్ నాయక్ ఆస్పత్రి కోసం కొన్న మిషన్కు రూ. 15.35 కోట్లు వెచ్చించింది. మరి ఇప్పుడున్న డిమాండును అందుకోడానికి ఎన్ని మిషన్లు తీసుకుంటారో.. అందుకు ఎంత ఖర్చుపెడతారో చూడాల్సి ఉంది.