మీ సేవలకు అభినందనలు | CM Jagan launches new CT and MRI scan devices In Srikakulam, Ongole, Nellore, Kadapa | Sakshi
Sakshi News home page

మీ సేవలకు అభినందనలు

Published Thu, May 20 2021 3:09 AM | Last Updated on Thu, May 20 2021 3:09 AM

CM Jagan launches new CT and MRI scan devices In Srikakulam, Ongole, Nellore, Kadapa - Sakshi

అధికారులందరికీ ఒక విజ్ఞప్తి. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్‌ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనే ఒత్తిడిలో ఉన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, శానిటేషన్‌ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు పగలు.. రాత్రి కష్టపడుతున్నారు. చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్‌ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ అభినందనలు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధనాస్పత్రుల్లో రూ.67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ పరికరాలను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని, మన దగ్గర టయర్‌–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మీరంతా (వైద్యులు, వైద్య సిబ్బంది) ఆస్పత్రుల్లో బా«ధ్యత తీసుకోవడమే కాకుండా, ఎంతో ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్‌ను ఎదుర్కోగలుగుతున్నామని అభినందించారు. అయితే ఫీవర్‌ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, ఈ దృష్ట్యా అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు 
► ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. అన్ని బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్‌ సదుపాయాలు కల్పించి ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించనున్నాం.  డయాగ్నస్టిక్‌ పరికరాల నిర్వహణ బాధ్యత ఆరోగ్య శ్రీ ట్రస్టుకు అప్పగిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో ఒక బోధనాస్పత్రి, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.
► ఈ రోజు రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రేడేషన్‌ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము.
► ఇవాళ రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్‌లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్‌ఐ పరికరాలను ప్రారంభించాం. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.

కొత్త ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు
► కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 టీచింగ్‌ ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీచింగ్‌ ఆస్పత్రితో పాటు, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ డయాగ్నస్టిక్‌ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము.  
► టీచింగ్‌ ఆస్పత్రుల్లో సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్‌ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది.  
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement