కొత్త రక్త కణాలు గుర్తింపు!
లండన్: మానవ రోగ నిరోధక వ్యవస్థలో కొత్త రక్త కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్ల రక్త కణాల్లో రకాలైన డెన్‌డ్రిటిక్, మోనోసైట్స్ కణాలకు చెందిన ఉప రకాలను వారు కనుగొన్నారు. డెన్‌డ్రిటిక్ కణాల్లో రెండు, మోనోసైట్స్‌లో రెండు ఉప రకాలను కొత్తగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన రాహుల్ సతిజ (న్యూయార్క్ యూనివర్సిటీ), కార్తిక్ శేఖర్ (బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమ్‌ఐటీ అండ్ హార్వర్డ్) కూడా ఉన్నారు. మానవ రక్త కణాల్లో జన్యువుల తీరును విశ్లేషించేందుకు సింగిల్ సెల్ జినోమిక్స్ పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగించారు.
‘తెల్ల రక్త కణాల్లో రెండు ప్రధాన రకాలైన డెన్‌డ్రిటిక్ సెల్స్, మోనోసైట్స్ మన శరీరానికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిరోధిస్తాయి’ అని ‘వెల్‌కమ్ ట్రస్ట్ ఇన్‌ఫెక్షన్ అండ్ ఇమ్యునో బయాలజీ’కి చెందిన దివ్య షా పేర్కొన్నారు. ఇతర రకాల రక్త కణాలను గుర్తించేందుకు కట్టింగ్ ఎడ్జ్ సాంకేతికతను వాడినట్లు తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ రక్తకణాలు ఏ విధంగా పనిచేస్తాయనే విషయంపై తదుపరి పరిశోధనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.