అంగోలా రాజధాని లువాండాలోని సెంట్రల్ జైలులో ఖైదీలలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో తొమ్మిది మంది ఖైదీలు మరణించారని అంగోలా పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు మృతదేహలను గుర్తించినట్లు చెప్పారు. ఆ ఘటనలో మరో 22 మంది ఖైదీలు గాయపడ్డారని చెప్పారు. వారిని సమీపంలోని నివిస్ బెండిన్హ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
కాగా గాయపడిన ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచన మేరకు గాయపడిన ఖైదీలను సెంట్రల్ మిలటరీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన ఖైదీల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. లువాండ సెంట్రల్ జైల్లో ఆ ఘటన మంగళవారం చోటు చేసుకుందని తెలిపారు.