కటారా కేసు: వికాస్, విశాల్ లకు 25ఏళ్లు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నితీశ్ కటారా హత్య కేసు దోషుల శిక్షాకాలన్ని ఇరవై ఐదేళ్ల కాలనికి తగ్గిస్తూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో హత్య కేసులో దోషులుగా తేలిన సోదరులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లకు ఢిల్లీ హైకోర్టు 30ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. కాగా, తమ శిక్షా కాలన్ని తగ్గించాలని కోరుతూ సోదరులిద్దరూ అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.
కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేవలం ముద్దాయిలే న్యాయం కోసం వేడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇరువురు సోదరులకు 25ఏళ్లు, నితీశ్ ను చంపడానికి సాయం చేసిన సుఖ్ దేవ్ పహిల్వాన్ కు 20ఏళ్లపాటు శిక్షను విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. నితీశ్ కటారా(25)ను ఘజియాబాద్ లో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు నిప్పంటించి చంపారు. తమ చెల్లెలు భారతి యాదవ్ తో నితీశ్ సన్నిహితంగా మెలుగుతుండటాన్ని ఓర్వలేని ఇరువురు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పరువుహత్యగా పేర్కొంది. అరుదైన కేసుగా పరిగణలోకి తీసుకుని దోషులకు 30ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తన కొడుకును చంపిన ఇరువురు సోదరులకు ఉరి శిక్ష వేయాలని నితీశ్ తల్లి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.